కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 11: ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే అనేక పండుగ సీజన్లలో ఎక్కువ సర్వీసులు ఏర్పాటు చేసి, శుభకార్యాలకు బస్సులు అద్దెకు ఇచ్చి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. ఇదే కోవలో వచ్చే దసరాకూ ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రీజియన్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు నుంచి హైదరాబాద్కు ప్రత్యేక సర్వీసులు నడుపనున్నది. హైదరాబాద్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎంతోమంది వ్యాపారాలు, ఉద్యోగాల రీత్యా వెళ్లి అక్కడ కుటుంబాలతో స్థిరపడ్డారు. పండుగ సమయంలో వారంతా స్వస్థలాలకు వస్తారు కాబట్టి వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల 13 నుంచి 23 వరకు ఈ సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.
ఖమ్మం డిపో నుంచి 230 సర్వీసులు, మధిర డిపో నుంచి 75, సత్తుపల్లి డిపో నుంచి 86, భద్రాచలం డిపో నుంచి 141, కొత్తగూడెం డిపో నుంచి 80, మణుగూరు డిపో నుంచి 83 ప్రత్యేక సర్వీసులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. ప్రయాణికుల నుంచి ఆర్టీసీ ఒక్క పైసా అయినా ఎక్కువ తీసుకోదు. సాధారణ చార్జీలు చెల్లించి ప్రయాణికులు ప్రయాణించొచ్చు.
ప్రయాణికులను ప్రోత్సహించేందుకు ఆర్టీసీ యాజమాన్యం వినూత్న నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 21 నుంచి 23 వరకు, 28 నుంచి 30వ వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల కోసం లక్కీడ్రా నిర్వహించనున్నది. ఆయా తేదీల్లో ప్రయాణం సాగించిన ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత టిక్కెట్ వెనుక ప్రయాణికుడి పేరు, ఫోన్ నెంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన బాక్సులో వేయాల్సి ఉంటుంది. యాజమాన్యం లక్కీడ్రా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 11 రీజియన్ల నుంచి ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళల నుంచి ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికీ రూ.9,900 చొప్పున నగదు బహమతులు అందించనున్నది.
దసరా సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల సౌకర్యార్థం సాధారణ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నది. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికులను ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా కూడా నిర్వహిస్తున్నాం. డ్రాలో పేరు వచ్చిన ప్రయాణికులకు బహుమతులు అందిస్తాం.