మామిళ్లగూడెం, జూలై 30 : డ్రైవర్లు దేవుళ్లతో సమానమని, వారు అప్రమత్తత, క్రమశిక్షణతో వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 30 వరకు ప్రమాద రహిత వారోత్సవాలను జిల్లా పరిధిలోని ఏడు డిపోలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాద రహిత డ్రైవింగ్ చేసిన డ్రైవర్లను ఖమ్మంలో మంగళవారం ఘనంగా సన్మానించారు.
అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రమాదాల్లో అతి తకువ శాతం తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో మాత్రమే ఉన్నాయని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కోరారు. ఇలాంటి వారోత్సవాలు పోలీస్ శాఖలోనూ నిర్వహిస్తామని తెలిపారు. ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరాం మాట్లాడుతూ ప్రమాదాలు, బస్సులు తదితర ఆస్తులకు నష్టం కలగకుండా ఉండేందుకు ఉద్యోగులకు తగిన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా ముగింపు కార్యక్రమం రీజినల్ పరిధిలో చేపట్టామన్నారు.
రీజియన్ స్థాయిలో ముగ్గురు ప్రమాద రహిత డ్రైవర్లను గుర్తించామని, వారిలో సత్తుపల్లి డిపో నుంచి ఎన్వీఎస్ రావుకు ప్రథమ స్థానం, ద్వితీయ స్థానంలో ఖమ్మం డిపో నుంచి డి.ఆంథోని, తృతీయ స్థానంలో ఖమ్మం డిపో నుంచి బి.రాములు ఉండగా.. వారిని సీపీ సన్మానించారు. డిపో స్థాయిలో ప్రతి డిపో నుంచి ముగ్గురు చొప్పున ప్రమాద రహిత డ్రైవర్లను గుర్తించి.. మొత్తంగా 21 మంది డ్రైవర్లను పోలీస్ కమిషనర్, ఇన్చార్జి ఆర్టీవో వెంకటరమణ సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్(ఆపరేషన్స్) జీఎన్.పవిత్ర, డిపో మేనేజర్లు, అకౌంట్స్ ఆఫీసర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.