మణుగూరు టౌన్, ఆగస్టు 12: మద్యం అలవాటు లేనివాళ్లు కూడా మద్యం తాగినట్లు చూపుతున్న బ్రీత్ అనలైజర్‌ను మార్చకుండా డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటూ ఆర్టీసీ మణుగూరు డిపో అద్దె బస్సు డ్రైవర్లు, సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఉదయం నుంచి వారు నిరసన చేపట్టి బస్సులను బయటకు తీయలేదు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్యం అలవాటు లేనివారు కూడా మద్యం తాగినట్లు బ్రీత్ అనలైజర్ చూపుతోందని, ఈ కారణంగా అధికారులు ఇటీవల ముగ్గురు కార్మికులకు సస్పెండ్ చేశారని అన్నారు. మద్యం అలవాటు లేని తమకు మరోసారి టెస్ట్ చేయాలని డ్రైవర్లు కోరినా.. నిబంధనలు ఒప్పుకోవంటూ అధికారులు వారిని సస్పెండ్ చేయడం తగదని అన్నారు. కాగా, వీరి ఆందోళనకు ఇఫ్టూ నాయకుడు మిడిదొడ్ల నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఫలితంగా 32 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రెండు షిఫ్టులకు చెందిన 76 మంది సిబ్బంది ఈ నిరసనలో పాల్గొన్నారు. ఉదయం కదలాల్సిన బస్సులు డిపోలోనే ఉండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విషయం తెలుసుకున్న మణుగూరు సీఐ సతీశ్‌కుమార్, ఎస్ఐ మేడ ప్రసాద్.. నిరసన వ్యక్తం చేస్తున్న డ్రైవర్లతో చర్చించారు. ఉదయం నుంచీ నిలిచి ఉన్న బస్సులను ఉదయం 10 గంటల సమయంలో పునరుద్ధరించారు. అనంతరం ఆర్టీసీ డీఎం శ్యాంసుందర్‌తోపాటు డ్రైవర్లతో మాట్లాడారు. ఆర్టీసీ అధికారులు బ్రీత్ అనలైజర్ మిషన్‌ను మార్చాలని, మద్యం అలవాటు లేని కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఉన్నతాధికారులతో చర్చించి మరోసారి టెస్ట్‌కు అనుమతివ్వాలని సూచించారు. అలవాటులేని ఓ కార్మికుడిని సస్పెండ్ చేసిన అంశంపై పునరాలోచన చేయాలని కోరారు. దీనికి ఆర్టీసీ డీఎం శ్యాంసుందర్ స్పందిస్తూ.. ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు నిరసన విరమించారు.