కూసుమంచి, సెప్టెంబర్ 23 : కలర్ ప్రింటర్‌తో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తూ వాటిని రైతులకు అంటగడుతున్న ముఠా గుట్టు ఓ బాధిత రైతు ఫిర్యాదుతో రట్టయింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కూసుమంచి ఎస్ఐ నాగరాజు, బాధిత రైతుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన కొత్తా జీవన్‌రెడ్డి.. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన మరో నలుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు రాని భూములు, వివాదాస్పద భూములు, తగాదాల భూములపై కన్నేశారు.
సదరు రైతులను కలిసి తమ గురించి పరిచయం చేసుకునే వారు. హైదరాబాద్‌లోని సీసీఎల్ఏలో తమకు తెలిసిన వారు ఉన్నారని, వారి ద్వారా తాము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని నమ్మబలికేవారు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిత్రం అదే జక్కేపల్లికి చెందిన చెందిన రైతు కళ్లెం అంజిరెడ్డి.. నిందితుడైన కొత్తా జీవన్‌రెడ్డిని కలిశాడు. తన వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్ బుక్ ఇప్పించాలని కోరాడు.
డీల్ మాట్లాడుకొని మొత్తం రూ.13.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో రూ.5 లక్షలను జీవన్‌రెడ్డి అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నప్పటికీ జీవన్‌రెడ్డి పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. రూ.5 లక్షల అడ్వాన్స్ తీసుకొని మరీ ఆలస్యం చేస్తుండడంతో జీవన్‌రెడ్డిని అంజిరెడ్డి ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్యా వివాదం జరిగింది. దీంతో బాధితుడు కళ్లెం అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తీగలాగితే..
బాధిత రైతు అంజిరెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సీఐ సంజీవ్, ఎస్సై నాగరాజు ఈ కేసును దర్యాప్తు చేశారు. ఇందులో జీవన్‌రెడ్డితోపాటు మరో నలుగురి హస్తం ఉన్నట్లు గుర్తించారు. వారినీ తీసుకొచ్చి విచారించగా.. నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతుల వద్ద, రియల్టర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు ఒప్పుకున్నారు.
దీంతో ఈ కేసులో జీవన్‌రెడ్డితోపాటు మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారానికి చెందిన వ్యాపారి కొండూరి కార్తీక్ (ప్రస్తుతం ఖమ్మం సాయిగణేశ్ నగర్లో నివాసం ఉంటున్నాడు), భద్రాద్రి జిల్లా పాల్వంచ టీచర్స్ కాలనీకి చెందిన వ్యాపారి పారిపత్తి సాయికుశల్, అదే జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి జక్కపల్లి ప్రసాద్, ఖమ్మం నగరంలోని మంచికంటి నగర్‌కు చెందిన ఏకే ప్రింటింగ్ ప్రెస్ బాధ్యుడు నందమూరి లక్ష్మణ్‌రావులను పోలీసులు మంగళవారం రిమాండ్‌కు పంపారు.
రాష్ట్రవ్యాప్తంగా వసూళ్లు..
అయితే, ఈ ముఠా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా రైతులకు నకిలీ పాస్ పుస్తకాలు అంటగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నాగర్ కర్నూల్, ఘట్కేసర్, సూర్యాపేట ప్రాంతాల్లోనూ అక్కడి రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. కేవలం జక్కేపల్లి గ్రామంలోనే 15 మంది రైతుల నుంచి రూ.1.5 కోట్లకుపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇంకా ఎవరైనా బాధితులుంటే తమను సంప్రదించాలని కూసుమంచి ఎస్సై నాగరాజు కోరారు. కాగా, నిందితుల నుంచి రెండు వాహనాలను, ఒక కలర్ ప్రింటర్‌ను, నకిలీ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.