-మామిళ్లగూడెం, అక్టోబర్ 16 : ఖమ్మం జిల్లాలో కొంతకాలంగా రౌడీషీటర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. వారి గ్యాంగ్‌వార్‌లతో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. కొందరు రౌడీషీటర్లు తమ రౌడీయిజాన్ని హీరోయిజంగా ప్రదర్శిస్తూ అమాయక యువకులు, విద్యార్థులను ప్రభావితం చేస్తున్నారు. వారి ఉచ్చులో పడి విద్యార్థులు, యువకులు తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా రౌడీమూకల ఆగడాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
ఆర్థిక నేరాలకు పాల్పడే వారు, రియల్ ఎస్టేట్ పేరుతో భూ దందాలు చేసేవారు, పెద్ద మనుషులుగా, ప్రజాప్రతినిధులుగా, మాజీ ప్రజాప్రతినిధులుగా ఉన్న కొందరు వ్యక్తులు.. పలువురి ఆస్తి తగాదాలకు, సెటిల్మెంట్లకు రౌడీషీటర్లను వినియోగిస్తున్నారు. దీంతో నేరాలు మరింతగా పుంజుకుంటున్నాయి. సమస్య వస్తే పోలీసులను, న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన ప్రజలు వాటి పరిష్కారానికి రౌడీలను ఆశ్రయిస్తున్నారు. దీని తెర వెనుక పెద్ద పెద్ద పలుకుపడి ఉన్న నేతల ‘హస్తం’ ఉండడంతో మరింతగా రెచ్చిపోతున్నారు.
ఖమ్మం నగరంలోని రౌడీషీటర్లు బర్త్‌డే వేడుకల పేరుతో దావత్‌లు, దందాలు నిర్వహిస్తున్నారు. సినీ ఫక్కీలో వేడుకలు జరుపుతున్నారు. ఆ వేడుకలకు యువకులను, ఇంటర్, డిగ్రీ విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు. మద్యం, గంజాయి సహా ఇతర డ్రగ్స్‌ను అలవాటు చేస్తున్నారు. వారి జీవితాన్ని చీకట్లోకి నెడుతున్నారు. జిల్లాలో ఉన్న రౌడీషీటర్లతోపాటు పొరుగు జిల్లాలో ఉన్న వారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో తల్వార్లు, కత్తులు, ఎయిర్ గన్స్ తిప్పుతూ అరాచకం సృష్టిస్తున్నారు. డీజేలతో శబ్దాల మధ్య చొక్కాలు లేకుండా డ్యాన్సులు వేస్తున్నారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తున్నారు. ఖమ్మం నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను షెల్టర్ జోన్లుగా మార్చుకొని తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో రఘునాథపాలెం మండల పరిధిలో ఉన్న ఓ రిసార్ట్‌లో ఇటీవల బర్త్‌డే వేడుకలు నిర్వహించిన కొందరు రౌడీ షీటర్లు వాటిని రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రౌడీ మూకలు ఒక చేతిలో మద్యం సీసాలు, మరో చేతిలో సిగరెట్లు పట్టుకొని హంగామా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చొక్కాలు తీసేసి అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయడం, చుట్టూ బౌనర్లను ఏర్పాటు చేసుకొని తల్వార్లు తిప్పడం, అనుచిత డైలాగులు వాడుతూ ప్రదర్శనలు ఇవ్వడం వంటి వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. కొందరు రౌడీషీటర్లు ఒక అడుగు ముందుకేస్తూ ఏకంగా పోలీసులకే వార్నింగ్‌లు ఇవ్వడం, వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీస్స్టేషన్ల ఆవరణలో రీల్స్ చేయడం వంటి చేష్టలకు పాల్పడుతున్నారు.
రౌడీషీటర్ల హంగామాను హీరోయిజంగా భావిస్తున్న కొందరు విద్యార్థులు, యువకులు వారి చర్యలకు ఆకర్షితులై తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో విద్యార్థులు, యువకుల అవసరాలను, భావోద్వేగాలను ఆసరాగా చేసుకుంటున్న రౌడీషీటర్లు వారిని మత్తుకు అలవాటు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పావులుగా వాడుకుంటున్నారు. దీంతో వారిపైనా కేసులు నమోదవుతున్నాయి. కాలక్రమేణా వారు కూడా నేర వృత్తికి అలవాటు పడుతున్నారు.
ప్రశాంత వాతావరణంలో ఉన్న ఖమ్మం నగరంలో రౌడీషీటర్ల ఆగడాల శ్రుతిమించుతుండడంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆర్థిక లావాదేవీలు, సెటిల్మెంట్లు, దందాలలో రెండు వర్గాలుగా విడిపోతున్న రౌడీషీటర్లు కొందరు అధికార పార్టీ నాయకులతో చేతులు కలుపుతున్నారు. కుటుంబ పంచాయితీల్లోకీ తలదూర్చి సామాన్యుల జీవనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఖమ్మం వీడీవోస్ కాలనీలో ఇటీవల ఓ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల పంచాయితీని ఆసరాగా చేసుకున్న నాయకులు చెరో పక్కన కొమ్ము కాశారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు పక్క జిల్లాల నుంచి రౌడీషీటర్లను, వారి మనుషులను ఇంట్లో పెట్టుకుని ఆ ప్రాంతమంతా హంగామా సృష్టించారు.
ఈ వ్యవహారమంతా పోలీసులకు తెలిసినప్పటికీ వారు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. సోషల్ మీడియా ద్వారా విషయం బయటకు రావడం, రెండు వర్గాల వారు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకోవడం వంటివి జరిగిన తరువాత పోలీసులు తీరిగ్గా చర్యలు ప్రారంభించారు. కానీ, ఈలోపు ఆ ప్రాంతంలో రౌడీమూకలు సృష్టించిన హంగామాతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అలాగే, శ్రీనగర్ కాలనీలో మద్యం మత్తులో రెండు వర్గాలుగా విడిపోయిన రౌడీషీటర్లు పరస్పరం దాడులు చేసుకున్న విషయం విదితమే. ఈ దాడులలో ఓ రౌడీషీటర్ తీవ్రంగా గాయపడడంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే రౌడీషీటర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.