– 14 అడుగులకు చేరిన నీటిమట్టం
– మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల ప్రకటన
– 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద సూచిక జారీ
ఖమ్మం రూరల్, ఆగస్టు 16 : ఖమ్మం నగరం ఈదులాపురం మున్సిపాలిటీ సమీపంలో గల మున్నేరు వాగుకు శనివారం ఉదయం నుంచి వరద ఉధృతి అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది. తెల్లవారుజామున 8 అడుగుల వద్ద ఉన్న మున్నేరు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ సాయంత్రం 4 గంటలకు 14 అడుగుల వరకు చేరింది. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా డీసీపీ ప్రసాద్ రావు, ఖమ్మం రూరల్ ఏసీబీ తిరుపతిరెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి మున్నేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించారు.
వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, పరిహాక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు ఆకీరు మరోవైపు మున్నేరు వరద ఉధృతి క్రమంగా పెరుగుకుంటూ వస్తుంది. నర్సంపేట, పరకాల, ఇల్లెందు, మహబూబాబాద్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మున్నేరు వరద తాకిడి పెరిగింది. వర్ధన్నపేట, హనుమకొండ, తొర్రూరు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఆకీరు పొంగి ప్రవహిస్తుంది. ఫలితంగా ఖమ్మం సమీపంలో మున్నేరుకు వరద తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.