ఎర్రుపాలెం, ఫిబ్రవరి 16 : తెలంగాణ రాష్ట్ర జాతిపిత, తొలి సీఎం, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయ్యవారిగూడెంలో జరిగిన విలేకరుల సమావేశంలో లింగాల కమల్‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదని, వారి కుటుంబాన్ని వెలివేయాలని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే మాట్లాడటం సమంజసం కాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమగ్ర సర్వే చేపట్టినప్పుడు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏమి మాట్లాడారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. సమగ్ర సర్వేను రాష్ట్ర ప్రజానీకం మొత్తం బహిష్కరించాలని మాట్లాడిన మాటలు మర్చిపోతే ఎలాగని విమర్శించారు. ఇప్పుడు మీరు రాష్ట్రంలో చేపట్టింది కులగణన సర్వేనేనని కేసీఆర్ కుటుంబం, ఆయన కులం మీకు తెలిసిందే కాబట్టి అదే రాసుకుంటే సరిపోయేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పాలన గాడి తప్పిందన్నారు.
రాష్ట్ర ప్రజానీకానికి అబద్ధపు ఆరు గ్యారెంటీలను హామీలుగా ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలను అటకెక్కించేందుకు కాంగ్రెస్ నాయకులు, కపట నాటకాలు ఆడుతున్నారని లింగాల కమల్‌రాజ్ పేర్కొన్నారు. కేబినెట్ మంత్రులెవరికి సమన్వయం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో ఒక్కో మంత్రి రోజుకో రకంగా మాట్లాడుతూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. రుణ మాఫీ విషయంలో 40 శాతం మాఫీ చేసి రైతులందరికీ 100 శాతం పూర్తి రుణమాఫీ చేశామని పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు. రుణమాఫీ మాదిరే రైతుబంధు విషయంలోనూ అదే జరుగుతుందని రాష్ట్ర రైతాంగం భావిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో రైతుబంధు, రుణమాఫీతోపాటు కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరిత హామీలే లింగాల పేర్కొన్నారు. వాటిని నెరవేర్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు, విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షాల మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎండగడుతూ ప్రజా సమస్యలపై, ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ కి మళ్ళీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సిఎం రేవంత్ రెడ్డి మాయమాటలు కట్టిపెట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను సక్రమంగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 17 న సోమవారం మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని మధిర నియోజక వర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ శీలం కవిత, నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, శేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణారావు, తిరుపతిరావు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.