ఖమ్మం రూరల్, నవంబర్ 13 : తరతరాలుగా వారసత్వంగా కొనసాగుతున్న బీసీల స్మశాన వాటిక స్థలాన్ని వేరొక సామాజిక వర్గం వారు తమదేనని వాదిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఖమ్మం రూరల్ మండల పరిధిలోని ఎం.వెంకటాయాలెం గ్రామానికి చెందిన పలు బీసీ కుల సంఘాల నాయకులు గురువారం తాసీల్దార్ రాంప్రసాద్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎం.వెంకటాయపాలెం గ్రామం శివారులో గ్రామానికి చెందిన చాకలి, పద్మశాలి, ముదిరాజ్, కుమ్మరి, గౌడ, మంగళి, కంసలి, యాదవ తదితర బీసీ కులాల ప్రజలు గ్రామ శివారులోని స్థలాన్ని స్మశానవాటికకు వినియోగించుకున్నట్లు తెలిపారు. అక్కడ కొంత స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను నిర్మించారని, ఆ ప్రక్కన గ్రామంలోని మరో సామాజిక వర్గానికి చెందిన వారి స్మశానవాటిక ఉందన్నారు.
ఐతే అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని మొత్తం సర్వే చేసి వందల ఏండ్ల నుండి కొనసాగుతున్న విధంగానే తమ కులాలకు స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని వారు తాసీల్దార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మునిగంటి వెంకన్న, నేరెళ్ల నాగేశ్వరరావు, దేవరకొండ ఉపేందర్, మునిగంటి నర్సింహారావు, ఉపేందర్, కుర్రా వెంకన్న, బాల్నె యాదగిరి, తోకల పెద్ద వెంకన్న, నిధిగొండ భిక్షం, నిదిగొండ వెంకటేశ్వర్లు, రామగిరి నాగరాజు, గుండాల సమ్మయ్య, పడిగల నాగేశ్వరరావు, మునిగంటి భార్గవ్ పాల్గొన్నారు.