కారేపల్లి, జూలై 14 : కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి రెవిన్యూ లింగం బంజరలో గల ముస్లిం స్మశాన వాటికను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక మసీద్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ముస్లిం స్మశాన వాటికలో లింగంబంజరకు చెందిన పురం అంజయ్య, రామరాజు జెసిబినితో గుంటలు త్రవ్వించడం వల్ల పూర్వీకుల సమాధులు ధ్వసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెవిన్యూ శాఖ అధికారులు స్పందించి ముస్లిం స్మశాన వాటికను సందర్శించి తమకు న్యాయం చేయాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో మసీదు కమిటీ సభ్యులు షేక్ సైదులు, ఎస్.కె మీరా, షేక్ రంజాన్, గౌస్, సలీం, సైదులు, అబూబకర్, ఖాజావలీ, హుస్సేన్ సాహెబ్, సైజ్ జాన్, సోన్, ఖాసీం, జాన్, జానీ, నజీర్, పాషా పాల్గొన్నారు.