గాలి దుమారం వస్తే చాలు భద్రాద్రి జిల్లా ప్రజలు కారుచీకట్లో మగ్గిపోతున్నారు. రోజురోజుకూ సాంకేతికత పెరుగుతున్నా విద్యుత్‌శాఖ మాత్రం పాత పద్ధతిలోనే పనులు చేస్తుండడంతో ప్రజలకు శాపంగా మారింది. కరెంట్ పోతే సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు విద్యుత్ సిబ్బంది లైన్ల వెంబడి తిరిగి గంటలకొద్దీ జనాల్ని కారుచీకట్లో ఉంచేస్తున్నారు. ఒకవైపు తగిన సిబ్బంది లేకపోవడం.. మరోవైపు గాలి దుమారానికి చెట్లు విరిగిపడిపోవడంతో వెరసి జిల్లా అంతా చీకట్లు కమ్ముకుంటున్నాయి.
-భద్రాద్రి కొత్తగూడెం, మే 26 (నమస్తే తెలంగాణ)
అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఇటీవల గాలిదుమారంతోపాటు భారీ వర్షం వచ్చింది.. అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి. అదేరోజు సాయంత్రం ఆరు గంటలకు పోయిన కరెంటు రాత్రి పది గంటల వరకు కూడా రాలేదు. ఆళ్లపల్లి మండలంలో గాలివాన లేదు.. వర్షం లేదు కానీ గంటల తరబడి కరెంటు పోతున్నది. ఎందుకని విద్యుత్ అధికారులను అడిగితే ఇల్లెందు ప్రాంతంలో చెట్లు పడిపోయాయని సమాధానం చెబుతున్నారు. దుమ్ముగూడెం మండలంలో ఇటీవల గాలివాన వచ్చింది.. రెండుగంటలపాటు కరెంటు ఆగింది. టేకులపల్లి మండలంలో గాలిదుమారానికి చెట్లు విరిగిపడ్డాయి.. వెంటనే కరెంట్ కట్. మంగల్‌తండా గ్రామం నుంచి బోడు వరకు లోవోల్టేజీ సమస్య వెంటాడుతున్నది. చండ్రుగొండ మండలంలో మధ్యాహ్నం నుంచి త్రీఫేజ్ ఉండడం లేదు. రాత్రి 12 గంటల వరకు కట్ చేస్తున్నారు. ఇలా ఒకటికాదు రెండుకాదు ప్రతి మండలంలో కరెంటు సమస్య వినియోగదారులను వెంటాడుతున్నది.
అధికారికంగానే త్రీఫేజ్ కోతలు..
ఒకవైపు విద్యుత్ కోతలు లేవని చెప్పుతూనే మరోవైపు త్రీఫేజ్ కరెంట్ కటింగ్ పెడుతున్నారు. దీంతో విద్యుత్‌తో పనిచేసే కార్మికులు, యజమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మరోవైపు రైస్‌మిల్లులు నడవక నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కూడా ఆశలు వదులుకున్నారు. పదే పదే కోతలు విధిస్తున్నా అధికారులు మాత్రం త్రీఫేజ్ కటింగ్ లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది.
తప్పని కష్టాలు..
రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్నా విద్యుత్ సంస్థలో మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడేలా ఉంది. ప్రతిసారీ విద్యుత్ సమస్య వస్తుంటే సాంకేతికతో తెలుసుకోవాల్సిన యంత్రాంగం పాత పద్ధతిలోనే అడవుల్లో తిరిగి నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమస్య తెలుసుకునే సరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతున్నది. దీంతో గంటలకొద్దీ కరెంటు లేక ప్రజలు చీకట్లో మగ్గాల్సి వస్తున్నది. చాలీచాలని సిబ్బందితో రాత్రులు అడవిబాట పడితే ఒక్కోసారి రోజుల తరబడి కారుచీకట్లో గడపాల్సి వస్తుందని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫలితమివ్వని ‘జంగిల్ కటింగ్’..
ప్రతి శనివారం జంగిల్ కటింగ్ పేరుతో కరెంటు కట్ చేసి మరమ్మతుల పనులు చేస్తున్నప్పటికీ చిన్నగాలి వస్తే చాలు వెంటనే కరెంట్ నిలిపివేస్తున్నారు. కరెంటు సమస్యల పరిష్కారం కోసం వారంలో ఒకరోజు ఫీడర్ వైజ్‌గా సెలవు ప్రకటిస్తారు.. కానీ రెండోరోజే చిన్న గాలివస్తే మళ్లీ చెట్లు విరిగిపడిపోయాయని విద్యుత్ నిలిపివేస్తున్నారు. ‘జంగిల్ కటింగ్’ వల్ల సైతం ఫలితం ఉండడం లేదు.. ఎండాకాలం, వర్షాకాలం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాదికి ఏడాది సబ్స్టేషన్లు పెరుగుతున్నా విద్యుత్ సమస్య తీరడం లేదు.
గాలివస్తే కరెంటు తీసేస్తున్నారు..
చిన్నపాటి గాలి దుమారం వచ్చినా వెంటనే కరెంటు తీసేస్తున్నారు. గాలిదుమారం తర్వాత వాతావరణం మంచిగా ఉన్నా ఎప్పటికో రెండు మూడు గంటల తర్వాత కరెంట్ ఇస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు కరెంట్ సమస్యలు తప్పడం లేదు. వానకాలం మరీ దారుణం. వర్షం తగ్గేదాక కారుచీకటి తప్పదు.
-ఆమడ నాగభూషణం, టేకులపల్లి గ్రామస్తుడు
రోజుకు రెండుగంటలు కటింగ్
గాలి ఉన్నా.. లేకున్నా కరెంటు కటింగ్ చేస్తున్నారు. ఎక్కడో గాలి వచ్చిందని చెప్పి మా ఆళ్లపల్లి మండలంలో రోజుకు రెండు గంటలు కటింగ్ పెడుతున్నారు. అసలే మారుమూల మండలం మాది.. సిబ్బంది సరిగా ఉండరు. రాత్రివేళ కరెంట్ ఐతే చాలా ఇబ్బంది పడుతున్నాము. అటవీప్రాంతంలో ఉండే గ్రామాలకు మరింత కష్టంగా ఉంది.
-కొమరం హనుమంతరావు, ఆళ్లపల్లి మాజీ జడ్పీటీసీ
త్వరితగతిన పరిష్కరిస్తున్నాం..
గాలి దుమారం వచ్చినప్పుడు చెట్లు పడిపోతున్నాయి. వాటిని ముందుగానే పూర్తిగా తొలగిద్దామంటే అటవీశాఖ అభ్యంతరం చెప్తున్నది. పై కొమ్మలు తొలగిస్తే సమస్య మళ్లీ పునరావృతమవుతున్నది. కరెంట్ పోయినప్పుడు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రస్తుతం కొత్త పద్ధతి ‘ఇండికేటర్ సిస్టమ్’ అమలులో ఉంది. 20 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 200 ఇండికేటర్లను ఏర్పాటు చేశాం. దీనిద్వారా సమస్యను వెంటనే తెలుసుకుని పరిష్కారం చేస్తున్నాం. ట్రిప్ అవకుండా కండక్టర్లు కొత్తవి వేస్తున్నాం. సిబ్బంది కొరత ఉంది. అయినా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నాం.
-జి.మహేందర్, ఎస్ఈ, విద్యుత్ శాఖ, భద్రాద్రి