ఖమ్మం, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భర్తీ చేసే అత్యున్నత కొలువు గ్రూప్-1. అయితే, దీని ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అయితే ఇందులో పలు అవకతవకలు జరిగాయని, మూల్యాంకనంలో సైతం తెలుగు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ అభ్యర్థుల వాదనలను విన్న న్యాయస్థానం.. రెండు నెలల అనంతరం మంగళవారం తీర్పును వెలువరించింది. 2025 మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. మెయిన్స్ సమాధాన పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని లేదా పరీక్షను తిరిగి నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశిస్తూ తీర్పు ప్రకటించింది.
అయితే, పరీక్ష కేంద్రాల ఎంపిక దగ్గర నుంచి జీఆర్ఎల్ వరకు అన్నింటిలోనూ తప్పులు దొర్లాయని, దానికి కోర్టు తీర్పే నిదర్శనమని అభ్యర్థులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ఎంతో విలువైన తమ సమయం వృథా అయిందని, అవకాశాలు కోల్పోతున్నామని నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు. హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఆశలతో రాత్రింబవళ్లూ చదివినా..
ఏళ్లకేళ్లు ఇళ్లకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్లూ చదివారు. కానీ, ప్రభుత్వం నిబంధనలు పాటించకపోవడం వల్ల అభ్యర్థుల శ్రమ వృథా అయింది. గ్రూప్-1 వాల్యుయేషన్‌లో తమకు తక్కువ మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో పక్షపాతం ప్రదర్శించారని రాష్ట్రస్థాయిలో పలువురు తెలుగు మీడియం అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. రీకౌంటింగ్‌కు సైతం అభ్యర్థులు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి దరఖాస్తు చేశారు.
అయినా ఎలాంటి మార్పులూ లేకుండానే మార్కులు వెల్లడించారు. దీనిపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగళవారం కోర్టు వెలువరించిన తీర్పు తెలుగు మీడియం అభ్యర్థులకు ఊరటనిచ్చింది. ప్రతిభావంతులైన అభ్యర్థులు తెలుగులో పరీక్ష రాసిన కారణంగానే తక్కువ మార్కులు వచ్చి నష్టపోయారు. ఈ నేపథ్యంలో మళ్లీ పరీక్ష నిర్వహించడం ద్వారా న్యాయం జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. రీవాల్యుయేషన్ చేసినా పారదర్శకంగా చేయాలని కోరుతున్నారు.
ప్రిలిమ్స్ హాల్‌టికెట్‌తో పరీక్షలు నిర్వహించాలి..
ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రిలిమ్స్ హాల్టికెట్లతోనే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలి. నిరుద్యోగులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు కోచింగ్ కూడా ఇవ్వాలి. 8 నెలల్లోపు ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి తుది తీర్పు ఇచ్చారు.
-బీ.తిరుపతిరావు, ఖమ్మం జిల్లా
అనుమానాలు నిజమేనని తేలింది..
2024 అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్‌లో చాలా అనుమానాలు ఉన్నాయనేది కోర్టు తుది తీర్పులో తేలింది. ఒకే సెంటర్ నుంచి చాలా మందికి టాప్ మార్కులు రావడం, తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు రావడం వల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. మూల్యాంకనం చేసినా ఎంతవరకు పారదర్శకంగా ఉంటుందో తెలియదు. కాబట్టి మళ్లీ ఎగ్జామ్ పెట్టాలి.
-ఎస్కే సాయి హుజుర్, ఖమ్మం జిల్లా
యూపీఎస్సీ తరహాలో నిర్వహించాలి..
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తనతోపాటు మిగతా అభ్యర్థులూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో కొన్ని అనుమానాలున్నాయి. తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు కూడా న్యాయం జరగాలంటే మళ్లీ పరీక్ష నిర్వహించాలి. యూపీఎస్సీ తరహాలో నిర్వహిస్తే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి అభ్యర్థులకు కూడా బాగుంటుంది.
-ఎం.రవిచంద్రిక, ఖమ్మం జిల్లా