కొత్తగూడెం సింగరేణి, జూన్ 4: సింగరేణి ఆసుపత్రిలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు ఎదుట నాయకులు బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు సంఘీభావం తెలిపి బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడారు. సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో యాజమాన్యం అలసత్వం వీడాలన్నారు.
కార్మికుల కష్టంతో సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తున్నప్పటికీ వారికి మెరుగైన వైద్యం అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కార్మికులకు అనేక హక్కులు కల్పించారని గుర్తు చేశారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న మెడికల రెఫరల్ విధానాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు.
కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని, సూపర్ స్పెషలిస్ట్ వైద్యులను నియమించాలని, ఖాళీగా ఉన్న పారా మెడికల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తొమ్మిది డిమాండ్లలో కూడిన వినతిపత్రాన్ని డైరెక్టర్(పా)కు, ప్రాజెక్టు అండ్ ప్లానింగ్‌కు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, టీబీజీకేఎస్ నాయకులు కె.సురేందర్‌రెడ్డి, రామ్మూర్తి, నూనె కొమరయ్య, రవి, కొత్తగూడెం ఏరియా కార్పొరేట్, మణుగూరు, భూపాలపల్లి, రామగుండం డివిజన్-1, 2, 3, శ్రీరాంపూర్, బెల్లింపల్లి నాయకులు గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస్, జాఫరుద్దీన్, నాగళి వెంకటేశ్వర్లు, సాంబయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్, మాలరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.