మూడు నెలల రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు ఒకేసారి పంపిణీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు రేషన్ డీలర్లను, ఇటు వినియోగదారులను అవస్థలు పడేలా చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఓవైపు నిల్వ సామర్థ్యం లేకపోవడం, మరోవైపు జిల్లా అవసరాలకు సరిపడా బియ్యం రాకపోవడం, ఇంకోవైపు సమయానుకూలంగా కార్డుదారులకు సరఫరా కాకపోవడం వంటి సమస్యలు చుట్టుముడుతున్న వేళ.. రానున్న మూడు నెలల బియ్యాన్నీ జూన్ నెలలోనే పంపిణీ చేయాలన్న కేంద్రం ఆదేశాలు ఆందోళనకు కారణమవుతున్నాయి.
ఖమ్మం జిల్లాలోని కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ప్రస్తుతం నెలకు అవసరమైన 6,434 మెట్రిక్ టన్నులు వస్తుంటేనే దిగుమతి చేసుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో తగినంత నిల్వ సామర్థ్యం గల గోదాములు లేకపోవడం వల్ల ఇప్పటికే ప్రతి నెలా వస్తున్న బియ్యాన్ని పొరుగు జిల్లాల్లో దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో మూడు నెలల బియ్యమూ ఒకేసారి వస్తే ఎలానో తెలియని అయోమయస్థితి ఏర్పడింది. పైగా మార్చి నెల వరకూ ఉన్న దొడ్డు బియ్యాన్ని రేషన్ షాపుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోకపోవడంతో ఆ బియ్యానికి పురుగులు పడుతున్నాయి.
-ఖమ్మం, మే 29
భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా రేషన్ కార్డుదారులకు ఆహార కొరతను రానీయకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా రాబోయే మూడు నెలల (జూన్, జూలై, ఆగస్టు) కోటాను ఒకేసారి జూన్ నెలలోనే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలని రాష్ర్టాలను ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే తొలుత కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
కేంద్రం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో కార్డుదారులకు తాము సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున వాటి సేకరణకు, సరఫరాకు ఒక నెల గడువు కావాలని కోరింది. గడువు ఇవ్వడం కుదరదని, మూడు నెలల బియ్యాన్ని పేదలకు ఒకేసారి అందించాల్సిందేనని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో కేంద్ర ఆదేశాల మేరకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే, ఖమ్మం జిల్లా కార్డుదారులకు ఒకేసారి సరఫరా చేయాల్సిన బియ్యం జిల్లాలో లేకపోవడం పెద్ద అవరోధంగా ఉంది. ఒకవేళ అష్టకష్టాలూ పడి తెప్పించినా ఆ బియ్యాన్ని రేషన్ షాపులకు తరలించడంలోనూ, కార్డుదారులకు పంపిణీ చేయడంలోనూ అడ్డంకులు తప్పేలా లేవు.
ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో 748 రేషన్ దుకాణాలున్నాయి. ఏఎఫ్ఎస్సీ కార్డులు 27,247, ఎఫ్ఎస్సీ కార్డులు 3,88,655, ఏఏపీ కార్డులు 3 కలుపుకొని 4,15,905 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలోని 12,03,943 మంది సభ్యులకు మూడు నెలలవి ఒకేసారి పంపిణీ చేయాలంటే 2,19,15,321 కేజీల బియ్యం అవసరం ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ బియ్యాన్ని తెప్పించేందుకు, పంపిణీ చేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 748 రేషన్ దుకాణాలున్నాయి. వాటిల్లో కొన్ని పెద్దవి.. మరికొన్ని చిన్నవి ఉన్నాయి. గ్రామాల్లోని డీలర్లు తమ ఇంటి వద్దనే బియ్యాన్ని దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తుంటారు. పట్టణాల్లోని డీలర్లు అద్దె గదుల్లో దింపుకొని కార్డుదారులకు సరఫరా చేస్తుంటారు. మరి మూడు నెలల బియ్యం ఒకేసారి వస్తే ఆయా గదులు సరిపోవంటూ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలవి మూడు విడతలుగా దిగుమతి చేసుకున్నా.. కార్డుదారులు కూడా మూడు దఫాలుగా చౌకదుకాణాలకు వచ్చి బియ్యాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. డీలర్లు కూడా నెల మొత్తమూ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇది ఇటు డీలర్లకు, అటు కార్డుదారులకు వ్యయప్రయాసలతో కూడుకున్న పని.
ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున్న మార్చి వరకూ వచ్చిన సుమారు మూడు వేల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం ఇటు రేషన్ షాపుల్లోనూ, అటు గోదాముల్లోనూ నిల్వ ఉన్నాయి. ఇప్పుడు మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం తెచ్చి అదే గోదాములు, షాపుల్లో వేస్తే.. అప్పటికే నిల్వ ఉన్న దొడ్డుబియ్యంలోని పురుగులు సన్నబియ్యానికి కూడా పట్టే ప్రమాదం ఉంది.
ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నెలకు సుమారు 6,434 మెట్రిక్ టన్నుల చొప్పున ఏప్రిల్, మే నెలల్లో ఖమ్మం జిల్లా కార్డుదారులకు అందించింది. అయితే, ఈ 6,434 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాకు వస్తేనే ఇక్కడ నిల్వ సామర్థ్యం లేదు. దీంతో అధికారులు పొరుగు జిల్లాల్లో దిగుమతి చేస్తున్నారు. అలాగే, జిల్లాలో సన్నబియ్యం లేని కారణంగా ప్రతి నెలా 30 నాటికి రేషన్ దుకాణాలకు చేరాల్సిన బియ్యం.. ఆ తదుపరి నెల 15 వరకూ చేరుతూనే ఉన్నాయి.
దీంతో పేదలకు పంపిణీ కూడా ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశం ప్రకారం మూడు నెలలకు కలిపి ఒకేసారి సుమారు 20 వేల క్వింటాళ్ల బియ్యం సేకరణపై కూడా సందేహాలున్నాయి. అన్ని బియ్యం లేవంటూ సాక్షాత్తూ ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. మరి కేంద్రం నిర్ణయం ప్రకారం మూడు నెలల బియ్యం ఒకేసారి రావడం, వాటిని పేదలకు పంపిణీ చేయాల్సి ఉండడం వంటివి ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మూడు నెలల బియ్యం పంపిణీ ప్రక్రియ జూన్ నెల మొత్తం ఉంటుంది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు ఇప్పటికే దిగుమతి అవుతున్నాయి. రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని త్వరలోనే గోదాములకు తరలిస్తాం.
-చందన్‌కుమార్, డీఎస్వో, ఖమ్మం