కారేపల్లి, ఆగస్టు 25 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాప్ డీలర్లతో వెట్టి చాకిరి చేపించుకుంటున్నాయని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల అధ్యక్షుడు ధరావత్ భద్రు నాయక్ విమర్శించారు. మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయం ముందు రేషన్ షాప్ డీలర్లతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల పై అనుసరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ కు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న రేషన్ డీలర్లకు గత ఐదు నెలలుగా కమీషన్ రానందున కుటుంబాలు గడవలేని దీన పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17,200మంది రేషన్ డీలర్లు ఉన్నారని ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా 2025 ఏప్రిల్ వరకు నెలవారీగా, జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలకు కలిపి ఒకేసారి రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసిందన్నారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఏ నెల కమిషన్ ఆ నెలలో జమ చేయకపోవడం వల్ల అప్పుల పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం మాదిరిగానే పాత పద్ధతిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్లకు వేరువేరుగా కాకుండా ఒకేసారి కమిషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ మతిన్, ఉపాధ్యక్షులు ఈసం మంగతాయి, డీలర్లు సూర్యకుమార్ వీరభద్రం, నాగేశ్వరరావు, భూక్య భీముడు మంగ్య, మంగిలాల్, బాసు, దల్ సింగ్, ఎల్లబోయిన వెంకన్న, బొందల జానయ్య, గోపమ్మ వీరభద్రమ్మ, కుర్శం నాగేశ్వరరావు, ఎట్టి నాగేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.