కమీషన్ నగదు కోసం రేషన్ డీలర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఐదు నెలలుగా రేవంత్ ప్రభుత్వం కమీషన్ విడుదల చేయకపోవడంతో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల్లోనూ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రేషన్ డీలర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథులుగా పని చేసే రేషన్ డీలర్లకు రావాల్సిన కమీషన్ను నెలల తరబడి పెండింగ్లో పెట్టడంతో రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ ఇవ్వకపోవడంతో రేషన్ షాపుల ద్వారా ప్రతి నెలా పేదలకు బియ్యం పంపిణీ చేసేందుకు అయ్యే ఖర్చులను డీలర్లు భరించే పరిస్థితి లేక వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. గోదాము నుంచి షాపులకు బియ్యం దిగుమతి చేసుకునే సమయంలో హమాలీల ఖర్చులు, షాపుల అద్దెలు, కరెంటు బిల్లులు, హెల్పర్ల ఖర్చులు వంటివి చెల్లించలేక డీలర్లు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాబట్టి రేషన్ డీలర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కమీషన్ను వేర్వేరుగా కాకుండా పాత పద్ధతిలోనే ఏ నెలకు ఆ నెల తమ ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం.. ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఎర్రుపాలెం, సత్తుపల్లి, కారేపల్లి, అశ్వాపురం, బూర్గంపహాడ్, పాల్వంచ, వేంసూరు, పెనుబల్లి మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాల అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.