దమ్మపేట, జూలై 16 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తాటిసుబ్బన్నగూడెంలోని తన స్వగృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలవిగాని హామీలతో రైతులను నమ్మించి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి కుంటి సాకులు చెబుతూ కొర్రీలు పెడుతోందని, రైతులను ఎలాగైనా అనర్హులుగా చేసే విధంగా జీవో నెంబర్ 567ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. దీని ప్రకారం రుణమాఫీకి అనర్హులు 80 శాతానికి పైగా ఉంటారని, మాఫీకి రేషన్ కార్డు నిబంధన ప్రతిపాదనను కూడా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు భరోసాలో కోత పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి మరీ కసరత్తు చేస్తోందని, ఇదే కోవలో రుణమాఫీని సైతం మమ అనిపించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. వారిని గోస పెట్టే ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు. రేవంత్రెడ్డి తాను ముఖ్యమంత్రి కాకముందు ఒక ఇంటర్వ్యూలో ప్రజలను మోసం చేస్తేనే నమ్ముతారని చెప్పారని, అప్పుడు చెప్పింది ఇప్పుడు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వారి పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.
ఖమ్మం, జూలై 16: త్యాగానికి ప్రతీక మొహర్రం అని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. విశ్వాసం, నమ్మకం కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలిచిందని గుర్తుచేశారు. మంచితనాన్ని, త్యాగాన్ని గుర్తుచేసుకోవడమే ఈ పండుగకు నిజమైన అర్థమని అన్నారు. త్యాగం, శాంతి, న్యాయం వంటి ఆదర్శాలు మనలో ఎప్పటికీ స్ఫూర్తిని నింపుతాయని వివరించారు.
ఉమ్మడి జిల్లా ప్రజలకు ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడాది పొడవునా తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగ అని గుర్తుచేశారు.
ఖమ్మం/ మామిళ్లగూడెం, జూలై 16: రాష్ట్రంలో రైతుల అవసరాలకు అనుగుణంగా గోదాములు నిర్మిస్తామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతుల పంటలను కాపాడేందుకు, మంచి ధర వచ్చే వరకూ వారు తమ పంటలను నిల్వ ఉంచుకునేంత వరకూ గిడ్డంగులు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయన.. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలతోపాటు రైతులు పండించిన పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తానని అన్నారు.
అన్నదాతలకు వెన్నుదన్నుగా ఉంటానని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థల చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయనకు.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్, శ్రీమంత రాక్స్ బంధుమిత్రుల ఆధ్వర్యంలో మంగళవారం అభినందన, ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు 15లోగా పూర్తవుతుందని, ఈ నెల 18 సాయంత్రంలోగా రూ.లక్ష రుణమాఫీ చేసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేస్తోందని అన్నారు.