అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేశామని, దీంతో రేషన్ కార్డుల సంఖ్య పెరిగిందని, అధిక సంఖ్యలో పేద కుటుంబాలు లబ్ధిపొందబోతున్నాయని, నేటి (ఈ నెల 14) నుంచి గ్రామగ్రామాన సభలు పెట్టి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న ప్రకటనలకు భద్రాద్రి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. ‘రేషన్ కార్డులు ఇవ్వండి మహాప్రభో..’ అంటూ తాము చేసిన దరఖాస్తులను ఇంకా పెండింగ్‌లోనే పెట్టి.. ‘ఇప్పటికే అందరికీ ఇచ్చాం.
ఈ నెల 14న తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి రేషన్‌కార్డుల పంపిణీని అట్టహాసంగా ప్రారంభిస్తారు.’ అంటూ ప్రకటనలు చేస్తుండడంపై మండిపడుతున్నారు. ప్రజాపాలన సభల్లోనూ, మీ సేవా కేంద్రాల్లోనూ తాము చేసుకున్న దరఖాస్తులను ఇంకా ఆమోదించకుండానే ‘అర్హులందరికీ కార్డులు పంపిణీ చేస్తున్నాం’ అంటూ ప్రగల్బాలు పలకడంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాము దరఖాస్తు పెట్టుకొని ఏడాదిన్నర అవుతున్నా దానిని ఇంత వరకూ ఆమోదించకుండా ‘రేషన్ కార్డుల సంఖ్య పెరిగింది. అత్యధిక కుటుంబాలకు లబ్ధిచేకూరుతోంది’ అంటూ మాట్లాడుతుండడంపై భగ్గుమంటున్నారు.
-అశ్వారావుపేట, జూలై 13
కాలయాపనలు, అబద్ధపు హామీలు, అసత్యపు ప్రచారాలు కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కులుగా ఉంటున్నాయంటూ జిల్లా ప్రజలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘ఏమీ అమలు చేయకుండానే.. అన్నీ అమలు చేశాం..’ అంటూ అసత్య ప్రచారాలు చేస్తుండడంపై విస్తుపోతున్నారు. రేషన్ కార్డుల పంపిణీనే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో, ప్రజాపాలన గ్రామసభల్లో కలిపి 73,748 మంది నిరుపేదలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇప్పటి వరకు 43,068 దరఖాస్తులను మాత్రమే ప్రభుత్వం పరిశీలించింది.
7,026 దరఖాస్తులను తిరస్కరించింది. మరో 16,464 దరఖాస్తులను పరిశీలన కోసం పెండింగ్‌లో పెట్టింది. కానీ ‘దరఖాస్తు చేసుకున్న అందరికీ ఈ నెల 14 నుంచి రేషన్‌కార్డులు ఇస్తున్నాం’ అంటూ ఆర్భాటంగా పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చాక రేషన్ కార్డుల కోసం జిల్లా ప్రజలు చేసుకున్న దరఖాస్తుల్లో సుమారు 40 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం.
కళ్లు కాయలు కాసేలా..
2023 డిసెంబర్ నుంచి 2024 జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో రైతుభరోసా, గృహాజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, మహాలక్ష్మి తదితర పథకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వాటన్నింటికీ రేషన్‌కార్డునే ప్రామాణికంగా పెట్టింది. దీంతో అప్పటికే రేషన్‌కార్డులు లేని పేదలందరూ ముందుగా తమకు రేషన్‌కార్డులు ఇవ్వాలంటూ ప్రజాపాలన గ్రామసభల్లో ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో ఆ సభల్లో నూతన రేషన్ కార్డుల కోసం, అప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్పుమార్పుల ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది.
దీంతో ఆ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ఏకంగా 54,093 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గ్రామసభలకు అందుబాటులో లేని 19,655 మంది ఆ తరువాత మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ తతాంగం పూర్తయి ఏడాదిన్నర దాటిపోయింది. కానీ ఇప్పటికీ వారిలో 40 శాతం మందికి రేషన్‌కార్డులు జారీ కాలేదు. ఈ ఏడాది జనవరి 26న మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి పంపిణీ చేసిన పథకాల్లో కూడా రేషన్ దరఖాస్తులు రాని వారు ఉన్నారు. అప్పటికి సాంకేతిక కారణాలు చూపుతూ కార్డు రాని వారిని సముదాయించిన ప్రభుత్వం.. ఇప్పటికీ వారిని సముదాయిస్తూనే ఉంది. దీంతో దరఖాస్తుదారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాపాలనలో 54,093 దరఖాస్తులు..
కొత్త రేషన్ మంజూరుపై ఆశలు పెట్టుకున్న నిరుపేదలు ప్రజాపాలన గ్రామసభల్లో 23 మండలాల నుంచి మొత్తం 54,093 దరఖాస్తులు పెట్టుకున్నారు. వీటిలో 47,860 దరఖాస్తులను మాత్రమే అధికారులు పరిశీలించారు. 34,782 మందిని అర్హులుగా గుర్తించారు. మరో 6,233 దరఖాస్తులను ఇంకా పరిశీలించలేదు. 5,888 దరఖాస్తులను అనర్హులుగా తేల్చారు. అలాగే మీసేవా కేంద్రాల్లో మరో 19,655 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీటిలో 8,286 మందిని అర్హులుగా, మరో 1,138 మందిని అనర్హులుగా గుర్తించారు. 10,231 దరఖాస్తులు వివిధ స్థాయిలో పరిశీలనలో, పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో గిర్దావర్ స్థాయిలో 6,912, తహసీల్దార్ స్థాయిలో 590, డీసీఎస్వో స్థాయిలో 2,729 దరఖాస్తులు ఉన్నాయి. వీటికి మోక్షం లభించకుండానే అధికార పార్టీ నేతల సిఫార్సులు ఉన్న వారి దరఖాస్తులు ఆమోదం పొందడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
దళారుల వసూళ్లు..
అయితే, కుటుంబం నుంచి వేరుపడి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేదల్లో చాలామంది పేర్లు మళ్లీ కుటుంబ సభ్యుల కార్డులో జత కలిశాయి. అప్పటికే ఉన్న మరికొందరు పేర్లు తొలగిపోయాయి. అలాంటివారందరూ లబోదిబోమంటూ తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు తీశారు. కొత్త రేషన్‌కార్డు దరఖాస్తు దారులూ అప్పటికే అక్కడ క్యూలు కట్టి ఆన్నారు. దీంతో దళారులు, డాటా ఎంటీ ఆపరేటర్లు వసూళ్లకు తెరలేపారు. ఒక్కో రేషన్ కార్డు ఆమోదానికి రూ.2,500 వరకూ వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నా..
కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఏడాదిన్నర దాటిపోయింది. ప్రభుత్వం రేషన్ కార్డు ఎప్పడిస్తుందా అని ఎదురుచూస్తున్నాం. ఈ క్రమంలో మూడు నెలల సన్న బియ్యం కూడా కోల్పోయాం.
-కుంభం పార్వతి, గృహణి, అశ్వారావుపేట
కార్డు ఇస్తారో.. ఇవ్వరో..
కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారైనా మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తుందో లేదోనని చూస్తున్నాం. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఇంకా రాలేదు. దాని కోసమే ఎదురు చేస్తున్నాం.
-ఆకుల నందిని, గృహిణి, చండ్రుగొండ
సన్న బియ్యం కోల్పోతున్నాం..
కేవలం రేషన్ కార్డు లేని కారణంగా రేషన్ దుకాణాల ద్వారా ఇస్తున్న సన్నం బియ్యాన్ని కోల్పోతున్నాం. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తోంది. ఇంకా కొత్త కార్డులు మంజూరు చేయట్లేదు. దాంతో పథకాలూ అందట్లేదు.
– మరపట్ల నాగమణి, గృహిణి, దమ్మపేట