వైరల్ జ్వరాలతో ప్రజలు వణికిపోతున్నారు. జ్వరం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులతో చతికిలబడుతున్నారు. వైరల్ జ్వరాలతోపాటు మలేరియా, టైఫాయిడ్ రోగులను పట్టిపీడిస్తున్నాయి. దీంతో ప్రతి ఆసుపత్రిలోనూ రోగులు క్యూ కడుతున్నారు. ఈసారి భారీ వర్షాలు కురవడం, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య సమస్య లోపించడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో జనాలు జ్వరాల బారినపడుతున్నారు. వైద్యశాఖ అధికారులు గ్రామాల్లో ర్యాపిడ్ సర్వే చేస్తున్నారు. గొత్తికోయల గ్రామాలే టార్గెట్‌గా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేపడుతున్నారు. గతేడాది 70 మలేరియా, 100 డెంగ్యూ కేసులు నమోదైతే.. ఈ ఏడాది 54 మలేరియా, 84 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.
మలేరియా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ ముందుచూపుతో శిబిరాలు ఏర్పాటు చేసినా సీజన్లో మాత్రం మలేరియా కేసుల నమోదు తగ్గడం లేదు. గ్రామాల్లో పారిశుధ్య లోపం, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంలో పంచాయతీ, మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందడంతో ప్రతియేడు జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది 54 మలేరియా, 84 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. ప్రైవేటులో ఉన్న కేసులు ఇంకా లెక్కలోకి రాలేదు. వైద్యశాఖ అధికారులు కేవలం వలస గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపడుతూ మిగతా గ్రామాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వానకాలం వచ్చిందంటే చాలు వసతి గృహాలు, గిరిజన గ్రామాల్లో జ్వర బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది.
హైరిస్క్ ఏరియాల్లో ర్యాపిడ్ సర్వేలు
ప్రతి ఏటా మలేరియా, డెంగ్యూ జ్వరాలు జనాల్ని పట్టిపీడిస్తున్నాయి. కానీ, హైరిస్క్ ప్రాంతాల్లో మాత్రమే వైద్యశాఖ ర్యాపిడ్ సర్వేలు చేసి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 160 హైరిస్క్ గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో జ్వరాలు ఉన్నవారి వద్ద రక్త నమూనాలను సేకరించారు. గ్రామాలు, వసతి గృహాల్లో దోమల మందు పిచికారీ చేస్తున్నారు. విద్యార్థులు, గొత్తికోయలు వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగించడం వల్ల వైరల్ ఫీవర్లు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెంది జనాన్ని పీడిస్తున్నాయి.
వెంటాడుతున్న మందుల సమస్య
ఆసుపత్రులు ఉన్నా మందుల సమస్య తీవ్రంగా వెంటాడుతున్నది. ప్రతి ఏటా ఈ సమస్య ఉందని అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం వల్ల పేదలు సైతం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లక తప్పడం లేదు. రక్త పరీక్షల కేంద్రాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినా పరీక్షా ఫలితం వెంటనే రాకపోవడంతో జనం ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. బీపీ, షుగర్, పారాసిటమల్, గ్యాస్ బిల్లలు తప్ప ఇతర మందులు పీహెచ్‌సీల్లో లేకపోవడంతో రోగులు పీహెచ్‌లకు వెళ్లాలంటే వెనుకడుగు వేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఆర్ఎంపీలే హవా కొనసాగిస్తున్నారు. రక్తపరీక్షల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను దోపిడీ చేస్తున్నాయి.
ముందస్తు చర్యలు తీసుకున్నాం..
మలేరియా నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకున్నాం. గతేడాదితో పోలిస్తే డెంగ్యూ, మలేరియా కేసులు తగ్గాయి. సీజన్లో వైరల్ జ్వరాలు వస్తాయి. కొత్త వైరస్లు రావడం వల్ల బాడీపెయిన్స్ ఉంటున్నాయి. వెంటనే వైద్యం తీసుకుంటే జ్వరాలు తగ్గిపోతాయి. ఆలస్యం చేస్తే ఇమ్యూనిటీ కోల్పోతారు. 160 గ్రామాల్లో రెండు విడతలు సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించి మందులిచ్చాం. నీరు నిల్వ ఉన్నచోట ఆయిల్‌బాల్స్ వేస్తున్నాం. గంబూషియా చేపలను వదులుతున్నాం. మందుల సమస్య ఎక్కడా లేదు.
– డాక్టర్ జయలక్ష్మి, డీఎంహెచ్‌వో, భద్రాద్రి కొత్తగూడెం