భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 21 (నమస్తే తెలంగాణ) ; రామన్నగూడెం ఆదివాసీలపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు కక్ష కట్టారు. నిరుపేదలు వీళ్లేం చేస్తారులే అనుకున్నారో ఏమో పట్టాలు కలిగిన వారి సొంత భూములను సైతం దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఆ భూముల్లో అటవీ శాఖ అధికారులు వెదురుమొక్కలు వేసి ఇవి తమవేనంటూ ఆదివాసీలను బెదిరిస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములకు పట్టాలు ఇవ్వకపోగా… పట్టాలున్న భూములను సైతం లాక్కుంటున్న అధికారులపై ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. తమ భూములను కాపాడుకునేందుకు రామన్నగూడెం వాసులంతా ఒక్కటయ్యారు. ‘మా భూములు మాకేనని’ నినదిస్తూ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద 200 కుటుంబాలు పిల్లాపాపలతో కలిసి నిరాహార దీక్షలకు దిగారు. వారంరోజులుగా అక్కడే వండుకొని తిని అక్కడే నిద్రిస్తున్నారు. అయినా ఆదివాసీల గోడును పట్టించుకున్న నాధుడే లేకపోవడం బాధాకరం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని రామన్నగూడెం గ్రామ రెవెన్యూలో 30, 36, 39 సర్వేనెంబర్ల భూమి మొత్తం 1,040 ఎకరాలు ఉంది. ఇందులో 573 ఎకరాల భూమికి పట్టాలు ఉన్నాయి.. ఆయా రైతులకు రైతుబంధు కూడా వస్తున్నది. భూమి శిస్తు కూడా కడుతున్నారు. మరో 467 ఎకరాల భూమి మాత్రం తాతముత్తాతల నాటిది. ఇది ఎంజాయ్మెంట్లో ఉంది. ప్రస్తుతం వారే సాగు చేసుకుంటున్నారు. అయితే పట్టాలున్న 573 ఎకరాల భూమిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని వెదురుమొక్కలు వేసుకున్నారు. దీంతో ఆదివాసీలు గత కొన్నేళ్లుగా పోరాటాలు చేసి అందులో 104 ఎకరాల భూమిని తిరిగి దక్కించుకున్నారు. కానీ, ఇంకా 469 ఎకరాల భూమి అటవీ శాఖ ఆధీనంలోనే ఉంది. దీనిపై ఎన్నిసార్లు దీక్షలు, ధర్నాలు చేసినా తమకు న్యాయం జరగడం లేదని, పట్టాలున్నప్పటికీ మా భూమిని మాకు ఇవ్వడంలేదంటూ ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు సైతం పట్టాలు ఇవ్వకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత సెప్టెంబర్ నెలలో వారం రోజులపాటు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు చేస్తే అధికారులు ఏదో కహాని చెప్పి దీక్షలు చేయకుండా ఆపేశారు. కానీ, మళ్లీ అదే సమస్యపై రామన్నగూడెం ఆదివాసీలు ఏకంగా 200 కుటుంబాలు కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్నారు. అసలు రామన్నగూడెంపై ఎందుకీ రాజకీయం అంటే.. అక్కడ అటవీ శాఖ అధికారులు తప్పిదం చేశారు. ఏళ్లనాటి సాగులో ఉండే భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే తమ బతుకులు మారుతాయని ఆదివాసీ ప్రజలు వేడుకుంటున్నారు.
అసెంబ్లీ వద్ద దీక్షలకు సిద్ధం..
గతంలో వారం రోజులపాటు దీక్షలు చేసిన ఆదివాసీలు ప్రస్తుతం మళ్లీ భద్రాద్రి కలెక్టరేట్ వద్ద వారం రోజులుగా దీక్షలు చేస్తున్నారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అధికారులు మాత్రం పట్టాల లెక్కలు మాకు తెలియదు.. భూమి అటవీ శాఖదే అంటూ నొక్కి చెబుతున్నారు. దీంతో ఆదివాసీలు అసెంబ్లీ వద్ద దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
న్యాయం జరిగే వరకు పోరాటం
మా తాతల కాలం నుంచి భూమి అనుభవంలో ఉన్నాం. ఎంజాయ్మెంట్లో ఉంది. మా భూములకు ప్రభుత్వం పట్టాలివ్వాలి. అధికారులు ప్రతిసారి మాపై కేసులు పెడుతున్నారు. ఏ ఒక్కరూ మాకు న్యాయం చేయడం లేదు. అధికారులు న్యాయంగా సర్వే చేసి మా భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలి.
-మడకం నాగేశ్వరరావు, రామన్నగూడెం ఆదివాసీ
ఆదివాసీలంటే చిన్నచూపు..
ఆదివాసీలమని మాపై చిన్నచూపు. మాకు న్యాయం చేయాలని నిరాహార దీక్షలు చేస్తున్నా ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పిల్లలతో వచ్చి ఇక్కడే ఉంటున్నాం. ఎన్నో రోజులు నిద్రలేకుండా బతుకుతున్నం. గతంలోనూ వారం రోజులపాటు పిల్లలతో కలిసి కలెక్టరేట్ వద్ద దీక్షలు చేసినా ఫలితం లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి. -మాడి దుర్గ, ఆదివాసీ మహిళ
ప్రతిసారి కేసులు పెడుతున్నారు..
భూమి మాది అంటే కేసులు పెడుతున్నారు. అసలు ఫారెస్టు వాళ్లకు ఇక్కడ భూమి లేదు. పెద్దసార్లు వచ్చి మా సమస్యను పట్టించుకోవాలి. నాయకులు ఉన్నా ఎవరూ ముందుకురావడం లేదు. ఓట్ల సమయంలో మాత్రం హామీలు ఇచ్చి వెళ్తున్నారు. దయచేసి పట్టాలు ఉన్న మా భూములు మాకు ఇప్పించండి.
-కొర్సా భద్రమ్మ, రామన్నగూడెం, అశ్వారావుపేట