భద్రాచలం, మే 14 : శ్రీరామ పునర్వసు దీక్షా విరమణను పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీరామ దీక్షితులతో రామయ్యకు పట్టాభిషేక కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించిన తర్వాత అదే వేదికపై పట్టాభిషేక మహోత్సవం జరిపారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్త రామదాసు తయారు చేయించిన దివ్యాభరణాలను ధరింపజేశారు. రాజముద్రిక, రాజ దండం, రాజ ఖడ్గం, ఛత్ర, చామరాలు తదితర రాజ చిహ్నాలను స్వామివారికి వేద మంత్రోచ్ఛారణల నడుమ అలంకరించారు. రామయ్య గుణగణాలు, శ్రీరామ రాజ్యం వైభవాన్ని వేద పండితులు వివరించారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి శ్రీరామ దీక్షితులు భారీగా తరలివచ్చారు.‘జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్’ అంటూ స్వామివారిని తలుస్తూ భక్తిభావంతో భక్తులు చేసిన జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.