మణుగూరు టౌన్, జూన్ 23 : డోలు వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) భద్రాద్రి జిల్లా మణుగూరులో కన్నుమూశారు. గొంతు సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఇక్కడి కూనవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ వనదేవతల జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవాన్ని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి ఆయన వివరించేవారు. కనీస సౌకర్యాలు లేని గ్రామాలకు కూడా కాలినడకన వెళ్లి మరీ వనదేవతల చరిత్రను కళారూపంలో చాటి చెప్పేవారు. డోలు వాయిద్యకారుడైన ఈయనను 2022 జనవరి 26న కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి 2022 మార్చి 28న ఢిల్లీలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. డోలువాయిద్య కళాకారుడు తెలుగు రాష్ర్టాల్లో సకిని రామచంద్రయ్య ఒక్కరే కావడం విశేషం.
పద్మశ్రీ సకిని రామచంద్రయ్య మరణవార్త తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితర ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు. భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కూడా మణుగూరులోని కూనవరంలో ఉన్న రామచంద్రయ్య నివాసంలో అతడి పార్దీవదేహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. 2022లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి ఆర్థిక సాయం, జిల్లా కేంద్రంలో 426 గజాల స్థలం కేటాయింపు సమస్యను వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే అంత్యక్రియల అనంతరం తనను కలవాలని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వారికి హామీఇచ్చారు. అదే విధంగా అనాదిగా వస్తున్న డోలు వాయిద్య కళను అంతరించిపోకుండా చర్యలు తీసుకుంటానని మాట ఇచ్చారు. కాగా, సకిని రామచంద్రయ్యకు భార్య బాపనమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒక కుమారుడు కాలేయ సంబంధ వ్యాధితో 2008లో మరణించిన విషయం విదితమే.