ఖమ్మం, ఆగస్టు 8: సహకార రం గానికి నిధుల కేటాయింపులో కేంద్రం విఫమైందని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. సహకార రంగం పై పార్లమెంటులో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
2021 జూలై 6న ప్రధాని మోదీ కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టి సహకార సంఘాల కార్యాలయాలను కంప్యూటరైజ్ చేయడం వల్ల వాటిల్లో పారదర్శకత పెరిగి సభ్యులకు ప్రయోజనం చేకూరిందని వివరించారు. అయితే, గత పదేళ్లలో తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు, మహిళా, చేనేత సహా పలు వృత్తి కార్మికులకు ఆయా సహకార సంఘాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడంతో రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి పురోగతి సాధించిందని గుర్తుచేశారు.
తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలమైన సహకార రంగం బలోపేతానికి పెద్ద ఎత్తున కృషి జరిగిందన్నారు. ఫలితంగా వ్యవసాయ, దాని అనుబంధ సహకార రంగాలు అద్భుతమైన ప్రగతిని సాధించాయని వివరించారు.