ఖమ్మం వ్యవసాయం, జూన్ 6 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గ సమావేశాలు కొద్ది నెలల నుంచి వరుసగా వాయిదా పడుతున్నాయి. ఫలితంగా సొసైటీల నిర్వహణ, రైతుల ప్రయోజనాల కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రస్తుత బ్యాంక్ ఇన్చార్జి చైర్మన్ తీరు, పాలకవవర్గ సభ్యుల వ్యవహారం ‘పిట్టపోరు.. పిట్టపోరు..’ అన్న చందంగా ఉంది. పాలకవర్గంలో ప్రస్తుతం బీ క్యాటగిరీకి చెందిన డైరెక్టర్ స్థానంతోపాటు ఇటీవల మరణించిన ఓ డైరెక్టర్ స్థానం ఖాళీగా ఉన్నాయి. అలాగే మాజీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ కూరకూల నాగభూషణం స్థానం కూడా ఖాళీగానే ఉంది. దీంతో ఆయా స్థానాలకు నూతన డైరెక్టర్ల ఎన్నిక జరగాల్సి ఉంది. అలాగే, కూరాకుల రాజీనామా తరువాత వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఇన్చార్జి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అందుకని ప్రస్తుత ఖాళీలను తక్షణమే భర్తీ చేయడంతోపాటు నూతన అధ్యక్షుడిని కూడా ఎన్నుకోవాల్సి ఉంది.
అయితే మూడు నెలల క్రితం అప్పుడున్న ఖాళీల భర్తీకి ఎన్నికలు నిర్వహించేందుకు పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేసి డీసీవోకు పంపాలని కోరుతూ మెజారిటీ సభ్యులు ఇన్చార్జి చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. అయితే వారి మాట నెగ్గలేదు. దీంతో నాటి నుంచి సదరు డైరెక్టర్లు అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. దీంతో మరోసారి గురువారం పాలకవర్గ సభ్యుల సమావేశాన్ని ఇన్చార్జి చైర్మన్ దొండపాటి ఏర్పాటు చేశారు. మొత్తం 16 మంది డైరెక్టర్లకుగాను.. 12 మంది హాజరయ్యారు. అయితే సమావేశ అజెండాలో మరో మూడు అంశాలను పొందుపర్చాలని పలువురు డైరెక్టర్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఖాళీ స్థానాల్లో డైరెక్టర్ల ఎన్నికలు, చైర్మన్ ఎన్నిక, ఉద్యోగులు, అధికారుల ఏకపక్ష బదిలీలు వంటి అంశాలను ఆ అజెండాలో పొందుపర్చలేదు. దీంతో గురువారం కూడా డైరెక్టర్లు సమావేశాన్ని బహిష్కరించారు. వారంతా డీసీసీబీ అతిథి గృహంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఇదిలా ఉండగా.. ఏటా వానకాలం సీజన్‌కు ముందు, సీజన్ ప్రారంభం తరువాత పాలకవర్గ సమావేశం నిర్వహిస్తారు. సొసైటీల ద్వారా విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంట రుణాలు, ఇతర రైతుల అవసరాలపై సమీక్షలు చేపడతారు. అయితే ఇంతటి ముఖ్యమైన ఈ సమయంలో రైతుల సమస్యలను గాలికి వదిలేసి పాలకవర్గ బాధ్యులు ఎవరికి వారు కేవలం సొంత అజెండాలకు ముందుకు తెస్తున్నారని, పాలకవర్గ సమావేశాలను వాయిదాలు పడేలా చేస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మార్కెట్లో పచ్చిరొట్ట విత్తనాల కొరత ఉంది. ఇతర విత్తనాల పంపిణీ కూడా ఆశించిన మేరకు జరగడం లేదు. ఇంకోవైపు రైతు రుణమాఫీపైనా సమీక్షించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో పాలకవర్గం అవలంబిస్తున్న తీరు వల్ల బ్యాంకు అధికారులు, సొసైటీల బాధ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పాలకవర్గ సమావేశం రద్దు జరిగినట్లయితే మొత్తంగా పాలకవర్గమే రద్దయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఇంతటి పరిస్థితుల్లో సభ్యులంతా రైతు ప్రయోజనాల కోసం పాలకవర్గ సమావేశాన్ని, జనరల్‌బాడీ సమావేశాన్ని నిర్వహిస్తారో.. లేదో.. చూడాలి.