Anasuya | మహిళల అంశాలపై బహిరంగంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా మహిళలపై వ్యాఖ్యలు, వారి స్వేచ్ఛపై పరిమితులు విధించే ప్రయత్నాలు జరిగితే మౌనంగా ఉండని వ్యక్తిగా అనసూయకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను అనేక మంది తప్పుబట్టగా, అనసూయ కూడా తన స్పందనను వెల్లడించింది. మహిళలు ఎలా ఉండాలి, ఎలా దుస్తులు ధరించాలి అనే విషయాల్లో నిర్ణయాధికారం పూర్తిగా వారిదేనని ఆమె స్పష్టం చేసింది.
శివాజీ తన అభిప్రాయాన్ని చెప్పినట్టే, తాను కూడా గౌరవంగా తన అభిప్రాయం వెల్లడించానని అనసూయ పేర్కొంది. ఈ స్పందన తర్వాత శివాజీ–అనసూయ మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో మొదలైంది. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం అనసూయకు మద్దతుగా నిలబడి మహిళల స్వేచ్ఛపై ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రశంసించగా, మరో వర్గం మాత్రం అనసూయ గతాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించింది. ఆమె యాంకర్‌గా చేసిన షోల్లో గ్లామర్, డబుల్ మీనింగ్ సంభాషణలు, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను చూపిస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ఈ విమర్శలు వ్యక్తిగత స్థాయికి వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇక కొందరు నెటిజన్లు “నువ్వు ఎప్పటి నుంచి హీరోయిన్ అయ్యావు?” అంటూ ప్రశ్నిస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనికి ‘హీరోయిన్’ అనే పదానికి అర్థం ఏమిటో చూపిస్తూ డిక్షనరీ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. హీరోయిన్ అంటే కేవలం సినిమాలో కథానాయిక మాత్రమే కాదని, ధైర్యం, స్వతంత్రత, సరైనదానికి నిలబడే శక్తి ఉన్న మహిళ కూడా హీరోయిన్ అని అర్థమని ఆమె గుర్తు చేసింది. ఇక తాజాగా ఓ నెటిజన్ శివాజీ వాడిన రెండు పదాలు తప్పుగా ఉన్నాయి కాని, ఆయన చెప్పింది కరెక్టేనా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటని అనసూయని అడగ్గా తాను స్పందిస్తూ.. శివాజీ ఎంతో కష్టపడి, మంచి పాత్రలు పోషించి, ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు. అయితే మహిళల భద్రత గురించి ఆయన మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే, కాకపోతే కేవలం హెచ్చరించడమే కాకుండా, అబ్బాయిలకు కూడా బాధ్యతను గుర్తుచేసేలా మాట్లాడి ఉంటే బాగుండేదని అనసూయ పేర్కొంది.