న్యూఢిల్లీ: 2023 సంవత్సరంలో దేశంలో సుమారు 49 లక్షల టైఫాయిడ్ జ్వరం(Typhoid Fever) కేసులు నమోదు అయినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. దీంట్లో 7850 మరణించినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో టైఫాయిడ్ జ్వరం కేసులు అధికంగా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో సుమారు 30 శాతం కేసులు నమోదు అయినట్లు నివేదిక ద్వారా తెలిసింది. ద లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ఈస్ట్ ఏషియాలో ఆ రిపోర్టును ప్రచురించారు.
టైఫాయిడ్ జ్వరం సోకినవారిలో 7.3 లక్షల మంది ఆస్పత్రిలో చేరారని, దాంట్లో ఆరు లక్షల మందికి ఫ్లోరోక్వినోలోన్ రెసిస్టెన్స్ కలిగి ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. యాంటీ బయాటిక్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ మందుగా దీన్ని వాడుతారు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ద్వారా టైఫాయిడ్ జ్వరం వస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతున్నది. ఒకటి నుంచి మూడు వారాల్లోగా లక్షణాలు కనిపిస్తాయి. హై ఫీవర్, తలనొప్పి, కడుపు నొప్పి, అలసట వస్తుంది. యాంటీబయాటిక్స్, సపోర్టి కేర్ ద్వారా చికిత్స అందిస్తారు.
లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ(వెల్లోర్) పరిశోధకులు టైఫాయిడ్ ఫీవర్పై నివేదిక రూపొందించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ఫ్లోరోక్వినోలోన్ రెసిస్టెంట్ కేసులను గుర్తించారు. ఈ రాష్ట్రాల్లో మరణాలు కూడా ఎక్కువే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.