ఖమ్మం, అక్టోబర్ 21: అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఖమ్మం నగరంలో నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న ఎల్ఆర్ఎస్, ఎంజీఎఫ్‌తో పాటు ఇతర పనులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 31లోపు పనులు పూర్తి చేయాలన్నారు. నగరాన్ని ఇప్పటికే సుందరీకరించామన్నారు. పేద ప్రజల నివాస ప్రాంతాల్లో అవసరమైన చోట వీడీఎఫ్ రోడ్స్ నిర్మించాలన్నారు. అంచనాను రూ.20 లక్షలకు మించకుండా రూపొందించాలన్నారు. ఇప్పటికే ఖమ్మం నగరంలో 9.6 కిలోమీటర్ల రోడ్స్, 40 కిలోమీటర్ల మేర సీసీ లైన్స్ మంజూరయ్యాయన్నారు.
60 డివిజన్ల పరిధిలోని 31 డివిజన్లలో డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. మిగిలిన డివిజన్లలోనూ పనులను ప్రారంభిస్తామన్నారు. వాల్ ప్రాజెక్ట్స్, డివైడర్స్, లైట్స్, గ్రీనరీ పనులపై దృష్టి సారించాలన్నారు. కాంట్రాక్టర్స్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఆరు పార్క్‌లు, రెండు వైకుంఠ ధామాలు, వెజ్ అండ్ నాన్ వెజ్ మారెట్లను మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో పందులు, కుకలు, కోతుల బెడద ఉందని, ప్రజల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కమిషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, ఎంఈ కృష్ణలాల్, డీఈలు రంగారావు, స్వరూపాపరాణి, ధరణి, శ్రీనివాస్, ఏఈ నవ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు.