ఖమ్మం, మే 26: ఖమ్మం నగర పరిధిలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించి వారి చిరకాల నెరవేర్చేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కంకణం కట్టుకున్నారు. స్థలాల కేటాయింపునకు 23 ఎకరాలకు వారం క్రితం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర క్యాబినెట్ నుంచి ఆమోదం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు తాజాగా గురువారం 23 ఎకరాలను కేసీఆర్ జర్నలిస్టు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కు స్థలాన్ని బదలాయిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో ప్రకారం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 256/2/పీలో 1.12 ఎకరాలు, 256/4/పీ లో 1.13, 270/2/పీలో 3 ,271/2/పీలో 4.13, 272/2/పీలో 2.02, 273/2/పీలో 0.13, 289/2/పీలో 3.03, 290/2/పీలో 1.30, 294/2/పీలో 2.01, 295/2/పీలో 1 ఎకరాలు, ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల సర్వేనెంబర్‌లోని 140/2/పీలో 1.36 ఎకరాలు, 141/2/పీలో 0.10, 146/2/పీలో 0.29 ఎకరాలను ప్రభుత్వం ఇండ్ల స్థలాల పంపిణీకి కేటాయించింది. జర్నలిస్టు సంక్షేమం కోసం శ్రమిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు జర్నలిస్టు సంఘాల నేతలు, జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. స్థలం కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు 23 ఎకరాల భూమిని హౌసింగ్ సోసైటీకి బదలాయిస్తూ శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని జర్నలిస్టుల రెండు దశాబ్దాల కల నెరవేర్చారన్నారు. ప్రతి జర్నలిస్టు సీనియారిటీ ప్రకారం సభ్యత్వం పొంది ఇంటి స్థలాన్ని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రక్రియలో ట్రేడ్ యూనియన్ టీజేఎఫ్ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించేందుకు రాష్ట్ర క్యాబినెట్ నుంచి 23 ఎకరాలకు ఆమోదం తీసుకువచ్చి ఈ మేరకు జీవో వచ్చేలా కృషి చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రామనారాయణ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, ఖమ్మం నగర అధ్యక్ష కార్యదర్శులు మైస పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.