నల్లగొండ ప్రతినిధి, మార్చి 3 (నమస్తే తెలంగాణ): వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆది నుంచీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ తొలి ప్రాధాన్య ఓట్ల సాధనలో అగ్రస్థానంలో నిలిచారు. తొలి ప్రాధాన్య ఓట్లల్లోనే 2,148 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఎలిమినేషన్ రౌండ్స్‌లోనూ ఎక్కడా తగ్గలేదు. మొత్తం 19 మంది అభ్యర్థుల్లో 17 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ వరకు శ్రీపాల్రెడ్డినే మెజార్టీ ఓట్లను సాధిస్తూ వచ్చారు.
ఎలిమినేషన్ రౌండ్స్ పూర్తయ్యే సరికి అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిగా శ్రీపాల్‌రెడ్డి విజేతగా నిలిచారు. రెండో స్థానం కోసం యూటీఎఫ్ బలపర్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిల మధ్య ‘నువ్వానేనా?’ అన్నట్లుగా చివరి వరకు పోరు కొనసాగింది. ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 10:30 గంటల వరకు కొనసాగింది. ఉదయం 11 గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు వివరాలను అభ్యర్థుల వారీగా రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు.
2,148 ఓట్ల ఆధిక్యం..
తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసే సరికి పీఆర్టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు. 2,148 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో నిలిచారు. మొత్తం 24,135 తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 494 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. మిగిలిన ఓట్లల్లో వరుసగా శ్రీపాల్‌రెడ్డికి 6,035, యూటీఎఫ్ నర్సిరెడ్డికి 4,820, హర్షవర్ధన్‌రెడ్డికి 4,437, పూల రవీందర్‌కు 3,115, సర్వోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజుకు 2,040, కొలిపాక వెంకటస్వామికి 421 ఓట్లు వచ్చాయి. మిగతా వారికి డబుల్ డిజిట్ దాటలేదు. చిలుక చంద్రశేఖర్‌కు ఒక్క ఓటు పోల్ కావడం గమనార్హం.
గెలుపు కోటాగా 11,821 ఓట్లు
తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిశాక చెల్లని ఓట్లను పక్కనపెట్టి చెల్లిన ఓట్ల నుంచి గెలుపు కోటాను ఖరారు చేశారు. మొత్తం చెల్లిన ఓట్లు 23,641 ఓట్లు కాగా.. అందులో 50 శాతం ప్లస్ ఒకటి కలిపి గెలుపు కోటా ఓట్లను నిర్ధారణ చేశారు. 11,821 ఓట్లను గెలుపు కోటాగా నిర్ధారణ చేయగా.. ఏ అభ్యర్థి కూడా తొలి ప్రాధాన్య ఓట్లల్లో గెలుపు కోటాకు దరిదాపుల్లోనూ లేరు. అత్యధిక ఓట్లు సాధించిన శ్రీపాల్‌రెడ్డి సైతం 5,786 ఓట్ల దూరంలో నిలిచారు. దీంతో ఎలిమినేషన్ రౌండ్స్‌లో అతి తక్కువ తొలి ప్రాధాన్య ఓట్లను సాధించిన అభ్యర్థులను కింద నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఇది సాయంత్రం 4 గంటల నుంచి మొదలైంది.
పూల రవీందర్ ఎలిమినేషన్లో భారీగా ఓట్లు
పూల రవీందర్ (3,992 ఓట్లు) ఎలిమినేషన్ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి అత్యధికంగా 1,348 ఓట్లు రాగా.. తర్వాత నర్సిరెడ్డికి 788 ఓట్లు, హర్షవర్ధన్‌రెడ్డికి 725 ఓట్లు కలిసొచ్చాయి. దీంతో ఈ రౌండ్ ముగిసే సరికి మొత్తం శ్రీపాల్‌రెడ్డికి 9,021 ఓట్లు, నర్సిరెడ్డికి 6,448 ఓట్లు, హర్షవర్ధన్‌రెడ్డికి 6,034 ఓట్లు వచ్చాయి. అయితే హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు.
శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు
పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి మొత్తం 13,969 ఓట్లు సాధించారు. గెలుపు కోటా 11,821 ఓట్లు కాగా.. అంతకుమించి 2,148 ఓట్లతో భారీ విజయం సాధించారు. రెండో స్థానంలో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎలిమినేషన్ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డి గెలుపు కోటాను అధిగమించి ముందుకువెళ్లారు. ఈ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డి 2,870 ఓట్లు సాధించి విజయం ఖరారు చేసుకున్నారు. అంతకుముందు హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు రాగా.. నర్సిరెడ్డికి 2,000 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక్కడే శ్రీపాల్‌రెడ్డి గెలుపు కోటాకు మరో 722 ఓట్ల దూరంలో నిలిచారు. దాంతో రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డిని కూడా ఎలిమినేట్ చేస్తూ లెక్కింపు కొనసాగించారు. చివరకు గెలుపు కోటాను మించి ఓట్లు సాధించి శ్రీపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. దాంతో ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి గెలుపును ధ్రువీకరిస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ ఇలా త్రిపాఠి ఆయనకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
రెండో ఓటు వేయని టీచర్లు 9,672 మంది
ఈ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు వేయని వారూ సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎలిమినేషన్ రౌండ్స్ లో లెక్కింపు పూర్తయ్యే సరికి మొత్తం 9,672 మంది బ్యాలెట్లో కేవలం తొలి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వేసి తర్వాత ఎవరికీ వేరే ప్రాధాన్యత ఓట్లు ఇవ్వలేదు.
ఎలిమినేషన్ రౌండ్స్‌లోనూ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యత
కాగా, మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వారిలో 17 మంది ఎలిమినేషన్ రౌండ్ల వారీగా కొనసాగింది. డబుల్ డిజిట్ ఓట్లు సాధించిన అభ్యర్థులతోపాటు త్రిబుల్ డిజిట్ సాధించిన ఒక్క అభ్యర్థి సైతం 13 రౌండ్స్‌లో ఎలిమినేట్ అయ్యారు. అప్పటికీ అదనంగా శ్రీపాల్‌రెడ్డికి 130, నర్సిరెడ్డికి 126, హర్షవర్ధన్‌రెడ్డికి 159, పూల రవీందర్‌కు 130, సర్వోత్తంరెడ్డికి 105, సుందర్రాజుకు 101 ఓట్లు మాత్రమే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు పోలయ్యాయి. అయితే సుందర్రాజు (2,141 ఓట్లు) ఎలిమినేషన్ రౌండ్లో మాత్రం అత్యధికంగా శ్రీపాల్‌రెడ్డికి 751, పూల రవీందర్‌కు 368, నర్సిరెడ్డికి 259, సర్వోత్తంరెడ్డికి 251, హర్షవర్ధన్‌రెడ్డికి 203 ఓట్లు పోలయ్యాయి. తర్వాత బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డి (2,645 ఓట్లు)ని కూడా ఎలిమినేట్ చేస్తూ ఆయన దాంట్లో పోలైన ద్వితీయ ప్రాధాన్య ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచారు. ఇందులోనూ శ్రీపాల్‌రెడ్డికి అత్యధికంగా 757 ఓట్లు, తర్వాత హర్షవర్ధన్‌రెడ్డికి 510 ఓట్లు, యూటీఎఫ్ నర్సిరెడ్డికి 455 ఓట్లు, పూల రవీందర్‌కు 375 ఓట్లు జత కలిశాయి. అయినప్పటికీ ఎవరు కూడా గెలుపు కోటాకు దరిదాపుల్లోకి రాలేకపోయారు.
494 చెల్లని ఓట్లు వేసిన గురువులు..
సమాజానికి మార్గనిర్దేశం చేసే ఉపాధ్యాయలు.. వారు వేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చెల్లని ఓట్లు ఉండడం గమనార్హం. చెల్లని ఓట్లు 494 ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇవి మొత్తం ఓట్లల్లో 2.04 శాతం కావడం గమనార్హం. 2019 ఎన్నికల్లోనూ 18,884 ఓట్లు పోలైతే.. అందులో 858 ఓట్లు చెల్లనివిగా నిర్ధారణ అయిన విషయం విదితమే.
విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాడుతా..
మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నల్లగొండ, మార్చి 3: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా ప్రభుత్వ విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తానని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ తర్వాత నర్సిరెడ్డి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లి మీడియాతో మాట్లాడారు. ఓటమి అనేది సహజమని అన్నారు. గతంలో తన ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు ఇప్పుడు శ్రీపాల్‌రెడ్డికి ఇచ్చారని అన్నారు. మరోసారి తనకు ఓట్లు వేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. శ్రీపాల్‌రెడ్డి గెలుపును స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
అంతిమ గెలుపు ఉపాధాయులదే: పింగిళి శ్రీపాల్‌రెడ్డి
నల్లగొండ, మార్చి 3: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతిమంగా ఉపాధ్యాయులు గెలిచారని పీఆర్టీయూ అభ్యర్థి, విజేత పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయన మీడియా సెంటర్లో విలేకరులతో మాట్లాడారు. ఈరోజు ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు అత్యంత విలువైనదని, వారి ఆత్మగౌవరమే వారిని విజయం దిశగా నడిపించిందని అన్నారు. తనపై బాధ్యత ఉంచి.. ఉపాధ్యాయులు తమ అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించినందుకు రానున్న రోజుల్లో పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పటిష్టంగా అభివృద్ధిపరిచే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.