ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 2 : ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ షురువైంది. ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత విద్యాశాఖ ఖాళీల వివరాల సేకరణ, బదిలీలకు అర్హులైన వారి సమాచారం సేకరిస్తున్నారు. శనివారం వరంగల్ ఆర్జేడీ నుంచి గ్రేడ్-2 హెచ్ఎంలకు అర్హులైన వారికి సంబంధించిన ప్రొవిజనల్ జాబితాను మల్టీజోన్లవారీగా విడుదల చేశారు. ఎస్ఏలో వివిధ కేటగిరీల నుంచి గ్రేడ్-2 హెచ్ఎంలుగా పదోన్నతి పొందే వారిలో 53 మందితో కూడిన వివరాలు ప్రభుత్వ స్కూళ్లకు చెందిన టీచర్లవి ఉన్నాయి. ఇందులో ఇద్దరికి డిగ్రీ లేకపోవడంతో పదోన్నతికి అనర్హులని పేర్కొన్నారు. జడ్పీ స్కూళ్లకు చెందిన 267 మందిని ఎంపిక చేశారు. ప్రొవిజనల్ జాబితాను విద్యాశాఖ వెబ్‌సైట్‌తోపాటు సంబంధిత ఉపాధ్యాయులకు సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంపించారు. గ్రేడ్-2 హెచ్ఎంల ఖాళీలు 81 వరకు ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలలకు చెందినవి 7, జడ్పీలకు చెందినవి 74 వరకు ఉన్నాయి. మల్టీజోన్-1 పరిధిలో ఖమ్మం జిల్లాతోపాటు ఇంకా 19 జిల్లాలు ఉన్నాయి. జోన్-1లో గ్రేడ్-2 హెచ్ఎంల పదోన్నతులు పొందేందుకు ప్రభుత్వ పాఠశాలలకు 259 మందిని, జడ్పీలకు 1,786 మందిని ఎంపిక చేశారు.
బదిలీ టీచర్ల గుర్తింపు చివరి దశకు..
తప్పనిసరి బదిలీతోపాటు రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని బదిలీకి అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ చివరి దశకు చేరింది. గత జనవరిలో బదిలీలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో అప్పుడు గుర్తించిన ఉపాధ్యాయులతోపాటు అదనంగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. 8 ఏళ్లు పూర్తయిన ఎస్ఏలు, ఎస్జీటీలు 920 మంది, ఐదేళ్లు పూర్తయిన పీజీ హెచ్ఎంలు 70 మంది వరకు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఎంఈవోల నుంచి సేకరించిన సమాచారాన్ని మరోసారి పునఃపరిశీలిస్తున్నారు. పదోన్నతులతో ఏర్పడే ఖాళీలతోపాటు ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలను ఆదివారం విద్యాశాఖ ప్రకటించనున్నది.