పాల్వంచ/ మణుగూరు టౌన్/ భద్రాచలం, జూలై 15 : నల్లగొండ జిల్లా వైటీపీఎస్‌లోని ప్లాంట్ల ప్రైవేటీకరణ విషయంలో యాజమాన్యాలు మొండి వైఖరి వీడాలి అంటూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్‌లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి చేపట్టిన నిరసన కార్యక్రమాలు బుధవారం 19వ రోజుకు చేరాయి.
పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, నిరసన ప్రదర్శన చేపట్టారు. మణుగూరు బీటీపీఎస్ ప్రధాన గేటు ఎదుట, భద్రాచలం విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జేఏసీ నాయకులు మాట్లాడుతూ యాష్, కోల్ ప్లాంట్లను ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేశారు. ఉన్న ఉద్యోగులతోపాటు అదనంగా నియమించి వాటి నిర్వహణ చేపట్టాలని సూచించారు.
ప్రైవేటీకరణ వద్దంటూ విద్యుత్ జేఏసీ, యాజమాన్యానికి మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయని, అందుకే నిరసన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పాల్వంచలో జేఏసీ చైర్మన్ రాజేందర్, యస్మిన్, ఉమామహేశ్వరరావు, బ్రహ్మాజీ, మధుబాబు, మహేశ్, రఘువీర్, డోలి శ్రీనివాసరావు, రాధాకృష్ణ, కేశబోయిన కోటేశ్వరరావు, సీతారామిరెడ్డి, తిరుపతి, వెంకటేశ్వర్లు, నరసింహారావు, మణుగూరులో జేఏసీ రీజినల్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, రవిప్రసాద్, నరేశ్, మహేశ్, వెంకట్రాం, బి.కృష్ణ, శోభన్, వరుణ్, భద్రాచలంలో టీజీపీఈజేఏసీ జిల్లా కన్వీనర్ జీవన్‌కుమార్, ఏడీఈ నర్సింహారావు, రాజారావు, వెంకట్రాజు, రామకృష్ణ, ఉదయ్, కేటీఎన్ మూర్తి, పెద్దరాజు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.