మణుగూరు టౌన్, జూన్ 10: తమకు ప్రత్యామ్నాయం, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేదాకా రైల్వే ట్రాక్ పనులను జరగనివ్వబోమని మణుగూరు మండలంలోని గాంధీనగర్ ప్రాంత వాసులు స్పష్టం చేశారు. ఈ మేరకు మణుగూరు నుంచి బీటీపీఎస్ వరకూ జరుగుతున్న రైల్వే ట్రాక్ పనులను గాంధీనగర్ వద్ద వారు మంగళవారం అడ్డుకున్నారు. ట్రాక్ నిర్మాణానికి సామగ్రిని రవాణా చేస్తున్న వాహనాలను నిలిపివేశారు. తమ సమస్యను పరిష్కరించేంత వరకూ ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించి వాహనాల ఎదుట కూర్చుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుమారు 200 కుటుంబాల వాళ్లం గాంధీనగర్లో నివసిస్తున్నామని అన్నారు. అయితే సింగరేణి ఓసీ నుంచి వచ్చే నీళ్లు బయటకు ప్రవహించే అవకాశం లేకపోవడంతో అవి తమ ప్రాంతంలో నిల్వ ఉంటున్నాయని, వర్షాలు వస్తే ఆ వరద నీళ్లు కూడా కలిసి తమ ఇళ్లు స్లాబ్ లెవల్ వరకూ మునుగుతున్నాయని అన్నారు. ఇప్పుడు రైల్వే ట్రాక్ నిర్మిస్తే ఆ నీళ్లు ప్రవహించే మార్గం లేక మా ఇళ్లన్నీ పూర్తిగా మునిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ వర్షాలు కురిస్తే మా ఇళ్లు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉందని అన్నారు. దానికి తోడు సింగరేణి లారీల వల్ల విపరీతమైన దుమ్మూధూళీ వ్యాప్తి చెంది తాము అనారోగ్యాలపాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని సింగరేణి అధికారులుగానీ, ప్రభుత్వ అధికారులుగానీ స్పందించి తమకు ప్రత్యామ్నాయం చూపాలని, తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ పనులు జరగనివ్వమంటూ భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.