కరకగూడెం, జూలై 13: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భద్రాద్రి జిల్లా కరకగూడెం ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ హామీ ప్రకారం ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కరకగూడెం ఆటో అడ్డాలో ఆదివారం ఏర్పాటుచేసిన ఆటోడ్రైవర్ల సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆటోడ్రైవర్లకిచ్చిన హామీని అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కారణంగా తమ కుటుంబాల పోషణ మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటు ప్రభుత్వ హామీ ప్రకారం ఆర్థిక సాయమూ అందకపోవడంతో ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఇంకా కాలయాపన చేయకుండా ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు నిట్టా సౌందర్యరావు, సాదనపల్లి లక్ష్మీనారాయణ, గుడ్ల రంజిత్‌కుమార్, ఎజ్జు సాయిచరణ్, కాట సాంబశివరావు, మధు, స్వామి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.