ఖమ్మం, జూన్ 21 : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండాల కృష్ణ, ఉద్యమకారుడు ఉప్పల వెంకటరమణ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ 13వ వర్ధంతిని పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సర్ విగ్రహానికి వారు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని జయశంకర్ సర్ తన విద్యార్థి జీవితం నుంచే చూశారని, పలు వేదికలపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి నినదించారని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడని, విద్యావేత్తగా ఆయన ప్రజల్లో తెలంగాణ కాంక్షను మేలొలిపి వారికి అండగా నిలిచారని పేరొన్నారు. మన మధ్య లేకున్నా ఆయనను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు బుర్రి వెంకట్కుమార్, బత్తుల మురళి, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, ఎస్కే షకీనా, జకుల లక్ష్మయ్య, ఎస్డీ బుడాన్, అహ్మద్, నరేశ్ పాల్గొన్నారు.