భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తు చేసిన అభ్యర్థుల వివరాలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే సాధారణ బదిలీల్లో భాగంగా అన్ని శాఖల అధికారులు తమ సిబ్బంది బదిలీల దరఖాస్తులను ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు సమర్పించాలని సూచించారు. 13 నుంచి 18వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామని, తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ అధికారులందరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.