మధిర, జూన్ 30 : మధిర మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి ఆరేగ శ్రీనివాసరావు, మండల కార్యదర్శి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో వార్డుల వారీగా క్రమ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారన్నారు. పనుల్లో భాగంగా వార్డుల్లో సీసీ రోడ్లు తవ్వి రోజుల తరబడి గుంటలు పూడ్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
దీని వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారని, స్కూళ్లకు వెళ్లే పిల్లలు బస్సుల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాత్రి వేళలో అత్యవసరంగా చికిత్స అవసరమైన వారికి ఎమర్జెన్సీ వెహికల్స్ రావడానికి సమస్యగా ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో యెన్నంశెట్టి అప్పారావు, వంకాయలపాటి నాగేశ్వరావు, దారావత్ మాదవి, చిదిరాల రాంబాబు, ఆళ్ల నాగబాబు, ఉమా మహేశ్వరరెడ్డి, కొత్తపల్లి నరసింహారావు పాల్గొన్నారు.