భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : అన్ని శాఖలు ఒకేచోట ఉండే కలెక్టరేట్లో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ షెడ్లు లేకపోవడంతో వాహనాలు ఎండకు ఎండి, వానకు తడవాల్సి వస్తున్నది. ప్రజలకు పాలన చేరువయ్యేందుకు ఐడీవోసీ(సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం)ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కనీసం పార్కింగ్ సౌకర్యం కల్పించడంలో విఫలమైంది. ఒకరోజూ కాదు.. రెండురోజులు కాదు నిత్యం ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకతప్పడం లేదు. ప్రతిరోజు 500 వాహనాలు అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. పార్కింగ్ షెడ్లు లేకపోవడంతో ఒకవైపు ప్రజలు.. మరోవైపు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నాలుగు చక్రాల వాహనాలు దుమ్ముధూళితో నాశనమవుతున్నాయి. చిన్న ఉద్యోగి నుంచి పెద్ద అధికారి వాహనాలకూ నీడ సమస్య తప్పడం లేదు.
చెప్పుకోలేక.. చేసేదేమీలేక..
ఐడీవోసీలో విశాలమైన ప్రాంగణం ఉన్నా వాహనాలకు నిలువ నీడలేకపోవడం విడ్డూరంగా ఉంది. పచ్చని వాతావరణం కోసం మొక్కలను బాగానే పెంచుతున్నారు.. కానీ.. వాహనాలు నిలపడానికి నీడలేకపోవడంతో ఎవరితో చెప్పుకోలేక.. చేసేదేమీలేక ఉద్యోగులు సతమతమవుతున్నారు. కలెక్టరేట్ ఎదుట నీడగా ఉంది కదా అని అక్కడ పార్కింగ్ చేస్తే సెక్యూరిటీ వచ్చి ఇక్కడ వాహనాలు పెట్టవద్దని తీయించేస్తున్నారు. దీంతో ఐడీవోసీ వెనుక భాగంలో పార్కింగ్ చేయాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చేది ఎండాకాలం టూ వీలర్లు ఎండలో పెడితే పెట్రోల్ ఆవిరైపోతుందని వారు వాపోతున్నారు. ప్రతిరోజూ లీటరు వరకు ఆవిరైతే జీతం అంతా పెట్రోల్‌కే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద అధికారులకు ముందుపడి చెప్పడానికి ధైర్యం లేక మదనపడుతున్నారు.
ప్రజలకూ తప్పని తిప్పలు..
కలెక్టరేట్ అంటే జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. ప్రతి సోమవారం ప్రజావాణికి వందలాది మంది వస్తారు. దగ్గర ప్రాంతం నుంచి వచ్చేవారు టూవీలర్ వాహనాలపై వస్తే.. దూరం నుంచి వచ్చేవాళ్లు నాలుగు చక్రాల వాహనాలపై వస్తున్నారు. వీరి వాహనాలకు పార్కింగ్ బెడద తప్పడం లేదు. ప్రజల వాహనాలకు కూడా నీడ లేకపోతే ఎట్లా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రతి వారం వస్తున్నా..
ప్రజల సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వడానికి ప్రతివారం వస్తున్నాను. వాహన పార్కింగ్ ఉన్నా నీడ లేదు. ఎండకు ఎండాలి.. వానకు తడవాల్సిందే. పెద్దసార్లు మారుతున్నా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలేదు. ఒక్కోసారి లోపలికి రావడానికి కూడా అనుమతించడం లేదు.
– యర్రా కామేష్, కొత్తగూడెం
ఉద్యోగులు చెప్పలేకపోతున్నారు..
కలెక్టరేట్ అసలే కొత్తగూడేనికి దూరంగా ఉంది. ప్రతి ఉద్యోగి వాహనం మీద రావాల్సిందే. బస్సు మీద రావాలంటే ఆర్టీసీ బస్సులు అక్కడ ఆపడం లేదు. వచ్చినా పైవరకు నడవాలంటే పెద్దవాళ్లకు ఇబ్బందులే. తీరా వాహనం తెస్తే ఎండలో పెట్టాలి. పైన చెట్లు కూడా లేవు. ఎండకు ఎండాల్సిందే. వానొస్తే తడిసిపోవడమే. మాకు కలెక్టరేట్లో చాలా పనులుంటాయి. ఆదివాసీల సమస్యల కోసం నిత్యం వస్తుంటాము. వాహనాల పార్కింగ్ కోసం షెడ్లు వేయించాలి.
– వాసం రామకృష్ణ, ఆదివాసీ నాయకుడు