ఇల్లెందు రూరల్, నవంబర్ 16 : పీహెచ్సీలు(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) సంజీవనిలా మారాయి.. రోగుల ప్రాణాలకు భరోసా లభిస్తున్నది.. వైద్యులు, పడకలు, వైద్యసిబ్బంది, మందులతోపాటు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. వైద్యం కోసం ప్రజలు ప్రభుత్వాసుపత్రులకు ధైర్యంగా వస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పీహెచ్సీల ముఖచిత్రమే మారిందనడంలో అతిశయోక్తి లేదు.
ఇల్లెందు మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు రెండు పీహెచ్సీలు ఉన్నాయి. ఒకటి కొమరారం, మరొకటి రొంపేడులో ఉంది. గతంలో పాలకులు వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు.. దీంతో ప్రజలకు పెద్దగా ఉపయోగం లేకుండాపోయేవి. అలాంటి పీహెచ్సీల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. అన్ని గ్రామాల ప్రజలకు వైద్యాన్ని పూర్తిగా అందుబాటులోకి తెచ్చింది. ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం సకల సదుపాయాలు, వైద్యులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నది. మందులు, మాత్రలతోపాటు బెడ్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రోగులకు పీహెచ్సీలు సంజీవనిలా మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
నిరంతరం అందుబాటులో వైద్యసిబ్బంది
రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, పాముకాటు, అత్యవసర చికిత్స తదితర వాటికి వైద్యులు నిరంతరం అందుబాటులో ఉన్నారు. రోగుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి కావాల్సిన మందులు, మాత్రలు అందుబాటులో ఉంచారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెండు, మూడు రోజులు ఉండేందుకు బెడ్లు ఉన్నాయి. రోగుల బంధువులు ఉండేందుకు సౌకర్యాలు ఉన్నాయి. తాగునీరు, కూర్చునేందుకు కుర్చీలు, బల్లాలు, ఫ్యాన్లు, లైట్లు, శుభ్రమైన టాయ్లెట్లు తదితర సదుపాయాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. ఏదైనా అత్యవసరంగా శస్త్రచికిత్స వస్తే తప్ప రోగులు కొత్తగూడెం, ఖమ్మం లాంటి ఆసుపత్రులకు వెళ్లడం లేదంటే అతిశయోక్తి కాదు.
తీరిన గర్భిణుల కష్టాలు
గర్భిణులు ప్రసవం చేయించుకోవాలంటే నరకయాతన పడేవారు. నేడు పీహెచ్సీల్లోనే పండంటి బిడ్డకు జన్మినిస్తున్నారు. ఆపసోపాలు పడుతూ మండల కేంద్రానికి వెళ్లి డెలివరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి నేటి రోజుల్లో లేదు. 108, 104 అందుబాటులోకి వచ్చాక కాన్పులు మరింత సులభతరమయ్యాయి. అప్పుడప్పుడు 108లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. వైద్యులతోపాటు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను గమనిస్తుండడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీ కేసులు బాగా పెరిగాయి. రొంపేడు పీహెచ్సీ పరిధిలో నాలుగేళ్లలో సుమారు 100 కాన్పులు జరిగాయని వైద్యుడు కిశోర్ తెలిపారు.
పీహెచ్సీలపై ఆదరణ పెరిగింది
పీహెచ్సీలపై ప్రజాదరణ పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పీహెచ్సీల దశ తిరోగమనంలో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆసుపత్రుల రూపురేఖలే మారిపోయాయి. గర్భిణులు కాన్పుల కోసం పీహెచ్సీలనే ఆశ్రయిస్తున్నారు. శస్త్రచికిత్స లేకుండానే సాధారణ కాన్పులు చేస్తున్నాం. నాలుగేళ్లలో కొమరారం పీహెచ్సీలో 195 కాన్పులు జరిగాయి.
– శ్రీలత, వైద్యురాలు, కొమరారం పీహెచ్సీ, ఇల్లెందు