అశ్వారావుపేట, ఫిబ్రవరి 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సేవలు రైతులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు కొత్త సంఘాలు ఏర్పాటు దశగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జనవరి 2వ తేదీన జిల్లా, 4వ తేదీన రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే 21 పీఏసీఎస్‌లు ఉండగా.. కొత్తగా 35 సంఘాలు ఏర్పాటు కోసం దరఖాస్తులు అందాయి. వీటి జాబితాను ప్రభుత్వానికి అందించారు. త్వరలోనే అధికారికంగా కొత్త సంఘాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ రాబోతోంది. సమగ్ర సేవల విస్తృతిలో భాగంగా కొత్త సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు సహకార సంఘాల సేవలు మరింత చేరువకానున్నాయి.
పల్లె బ్యాంకులుగా పేరొందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) సేవలను జాతీయస్థాయిలో విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాల సేవలను రైతులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కొత్త సంఘాల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. దీంతో జిల్లాలవారీగా అవసరమైన కొత్త సంఘాల కోసం ఉన్న పీఏసీఎస్‌ల నుంచి అధికారులు దరఖాస్తులు అందుకున్నారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొత్త సంఘాలు ఏర్పాటు చేయాల్సిందిగా 35 దరఖాస్తులు అందాయి. ఎక్కువ మంది రైతులు లేదా గ్రామాలు ఉన్న సొసైటీల తీరును బట్టి విభజించాలని అధికారులు నిర్ణయించారు.
కమర్షియల్ బ్యాంకులకు దీటుగా రైతులకు సేవలు అందిస్తున్న పీఏసీఎస్‌లు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. సాగు మొదలు పిల్లలకు విదేశీ రుణాల వరకు విభిన్న సేవలను పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందుతున్నాయి. రైతులకు సొసైటీల సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని కొత్త సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించింది. గడిచిన దశాబ్ద కాలంలో సొసైటీల్లో సభ్యుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 2008లో కష్టాల్లో ఉన్న కాలక్రమేణా ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే నాబార్డు సహకారంలో రైతులకు కమర్షియల్ బ్యాంకులకు దీటుగా నాణ్యమైన సేవలు అందిస్తున్నాయి.