జూలూరుపాడు, ఏప్రిల్ 28: కేసీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు వాగ్ధానాలను, మోసపూరిత హామీలను ప్రజలు గమనించారని అన్నారు. అందుకోసమే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా సైనికుల్లా ముందుకుసాగాలని, పార్టీ అభ్యర్థులకు అధిక మెజార్టీ అందించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవితల విజయం కోసం సోమ, మంగళవారాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్‌షోలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జూలూరుపాడులోని బీఆర్ఎస్ మండల కార్యాలయంలో ఆదివారం జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం శ్రేణులు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ వెళ్లి గడిచిన పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలుచేసిన సంక్షే మ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. అదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తప్పు డు హామీలను, వాటిని విస్మరించిన తీరును ప్రజలకు విశదీకరించాలని కోరారు.
అలాగే, అధికార పార్టీ నేతల బెదిరింపులను సహించేది లేదని స్పష్టం చేశారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ఈ ప్రభుత్వానికి మనుగడ కష్టమని అన్నారు. ఆగస్టు నాటికి ఆ పార్టీ ఉండదు కాబట్టే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడంటూ సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డే చెప్పుకుంటున్నారని అన్నారు. అలాగే, బీఆర్ఎస్ బలోపేతానికి చేసేందుకు త్వరలోనే గ్రామస్ధాయి నుంచి రాష్ర్ట స్ధాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ.. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తరువాత మాటమార్చిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే మళ్లీ ఆగస్టు 15 అంటూ నాటకమాడుతోందని విమర్శించారు. వైరా నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే కాంగ్రెస్ హామీలన్నీ మోసాలేనని ప్రజలు గుర్తించారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, లాకావత్ గిరిబాబు, యల్లం కి సత్యనారాయణ, పోలుదాసు కృష్ణమూర్తి, చావా వెంకటరామారావు, మూడు చిట్టిబాబు, యదళ్లపల్లి వీరభద్రం, కొడెం సీతాకుమారి పాల్గొన్నారు.