కొత్త ఆశలు నింపిన సీఎం కేసీఆర్ ప్రకటన
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రైవేటు ఉద్యోగాలను వదిలి..
కోచింగ్ సెంటర్లకు యువత పరుగులు..
సర్కార్ జాబ్ సాధించడమే లక్ష్యంగా ప్రిపరేషన్
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 11: తెలంగాణలో కొలువుల జాతర మైదలైంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 80 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చేసిన ప్రకటన నిరుద్యోగులకు కొండంత ధైర్యాన్ని నింపింది. ప్రభుత్వ కొలువు కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురింపజేసింది. సీఎం ప్రకటనతో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉద్యోగం వదిలేసి కోచింగ్ బాట పడుతున్నారు.
కోచింగ్ సెంటర్లు కళకళ..
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనతో రాష్ట్రంలో సంచలనం నెలకొన్నది. పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ.. ఇలా.. ఎన్నో డిపార్ట్మెంట్లలో ఖాళీలు ప్రకటించడంతో యువతలో కొత ఆశలు నిండాయి. దీంతో ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న లైబ్రరీలు, స్టడీ హాల్స్ ఇప్పుడు విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. రెండేళ్లుగా తెరుచుకోని కోచింగ్ సెంటర్లు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న వారితో కళకళలాడుతున్నాయి. పోటీ పరీక్షల పుస్తకాలతో బుక్‌స్టాల్స్ నిండుగా దర్శనమిస్తున్నాయి. ఇక ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయడమే తరువాయి పోటీపడి పరీక్షలు రాసి, కొలువు సాధించేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు.
సీఎం ప్రకటనతో ధైర్యం..
సీఎం కేసీఆర్ ఒకేసారి 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించడం నిరుద్యోగుల్లో ధైర్యాన్ని నింపింది. ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడిన వారందరూ ఇప్పుడు తిరిగి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొందరైతే చేస్తున్న ఉద్యోగాలను సైతం పక్కన పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. ఎన్ని రోజులు ప్రైవేట్ ఉద్యోగం చేసినా ఉపయోగం లేదని, ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కసితో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఎన్నో నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో ఏదో ఒక కొలువు రాకపోతుందా.. అనే దృఢ నిశ్చయంతో చదువుతున్నారు.
కరోనా నేర్పిన పాఠం ఇదీ..
కరోనా కారణంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లను సైతం తొలగించాయి. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ భద్రత లేదనే విషయం కరోనాతో స్పష్టమైంది. దీంతో ఎక్కువ మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఆసక్తి చూపుతున్నారు. చిన్న ఉద్యోగం చేసినా సరే అది సర్కారు ఉద్యోగమే కావాలని కోరుకుంటున్నారు. గతంలో కంటే ఈసారి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నా..
నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కల. డిగ్రీ పూర్తి కాగానే నేను ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగం మొదలుపెట్టాను. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇన్నాళ్లూ ఎదురు చూశా. తాజాగా సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై చేసిన ప్రకటనతో నాకు ధైర్యం వచ్చింది. వెంటనే ప్రైవేటు ఉద్యోగాన్ని వదిలి సీరియస్‌గా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా.
– మేకల శివ, విద్యార్థి, కల్లూరు
పక్కాగా ఉద్యోగం సాధిస్తా..
నేను డిగ్రీ పూర్తి చేసి స్థానికంగా ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నాను. త్వరలో వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నేను టీచర్ ఉద్యోగం మానేసి ప్రిపరేషన్‌పై దృష్టి సారించారు. ఈ సారి ఎలాగైనా ఉద్యోగం సాధిస్తా.
– మర్రి శ్రావణి, విద్యార్థిని, చింతకాని మండలం, గాంధీనగర్