ఖమ్మం రూరల్, ఆగస్టు 12 : రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవడం పాటు మున్నేరు వాగుకు భారీ వరద వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుకూలంగా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని ఎదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ పి.రాంప్రసాదు తెలిపారు. మంగళవారం వరదల నుంచి బాధితులని కాపాడుకునేందుకు గాను అవసరమైన అత్యవసర వాహనాలు, ఇతర సామగ్రిని వారు పరిశీలించారు. గజ ఈతగాళ్లతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఆదేశాలకు అనుగుణంగా మున్నేరు వరద విపత్తు నివారణకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని టోల్ ఫ్రీ నెంబర్ 9515 68 5414 తో పాటు ఖమ్మం రూరల్ తాసీల్దార్ కార్యాలయంలో సైతం మరో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు టోల్ ఫ్రీ నెంబర్ 833 193 0583 తెలిపారు.
24 గంటల పాటు సేవలో అందుబాటులో ఉంటాయన్నారు. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 డివిజన్లలో ప్రతి డివిజన్ కు సెక్టోరియల్ ఆఫీసర్ వార్డు ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా బాధితులను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకుగాను ఆరు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వరదలు, వర్షాల సమయంలో ప్రజలు వదంతులు, పుకార్లను నమ్మవద్దన్నారు. టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
Khammam Rural : వరద విపత్తుల నివారణకు ముందస్తు చర్యలు : మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి