– ఎన్ఎస్పీ కాల్వ పునరుద్ధరణ పనులను పర్యవేక్షణ
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 08 : వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ ఒకటి పరిధిలోని ఎన్ఎస్పీ కాల్వ లింక్ కెనాల్ పునరుద్ధరణ పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. సాగర్ కాల్వ నుండి ఏదులాపురం చెరువుకు నీటి సరఫరా జరిగే కాల్వ, తూము పునరుద్ధరణ పనులపై మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కాల్వ పరిస్థితి, సాగర్ కాల్వ నుండి చెరువు వరకు ఉన్న దూరం, నీరు సాఫీగా ప్రవహించేందుకు అనువైన పరిస్థితులు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. సాధ్యమైనంత త్వరితగతిన కాల్వ, తూము పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలం పరిధిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై కలెక్టర్ ఆరా తీశారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఏ ఒక్కరు మిస్ కాకుండా. ప్రతి ఒక్కరిని హియరింగ్ కు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు సైతం చర్యలు చేపట్టాలన్నారు. మున్నేరు, ఇతర చెరువులలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున తక్కువ ఎత్తులో గల గణేష్ విగ్రహాలను మండపాలపై ఏర్పాటు చేసుకునే విధంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఎంసీ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, తాసీల్దార్ వినయేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఏఈ విక్రమ్, పలువురు మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి : కలెక్టర్ దివాకర టీఎస్