చండ్రుగొండ/ దమ్మపేట/ అన్నపురెడ్డిపల్లి/ అశ్వారావుపేట/ అశ్వాపురం/ కొత్తగూడెం గణేశ్‌టెంపుల్/ కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 3 : చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఉన్న అఖిలపక్షం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. చండ్రుగొండ మండలానికి సంబంధించిన కాంగ్రెసేతర పక్షాలు(బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర గిరిజన సంఘాల బాధ్యులు) నాయకులను తెల్లవారుజాము నుంచే అరెస్టు చేసి బస్సులో కొత్తగూడేనికి తరలించారు. సీఎం పర్యటన ముగిశాక వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
చండ్రుగొండ ప్రధాన సెంటర్లో వ్యాపార సముదాయాలను పోలీసులు బలవంతంగా మూయించేశారు. సీఎం పర్యటనలో తమ సమస్యలు చెప్పుకుందామనుకున్న ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులకు ఆ అవకాశం లభించలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న బహిరంగ సభలో జిల్లా జర్నలిస్టు సంఘం నాయకుడు మంది ఉదయ్‌కుమార్ ప్లకార్డుతో నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్లు, ఇండ్ల స్థలాల హామీ ఏమైందని ప్రశ్నించారు. పోలీసులు బలవంతంగా సదరు జర్నలిస్టుని కూర్చోబెట్టారు. పోలీసుల నిర్బంధంపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది.
సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకుడు పండూరి వీరబాబు, సీపీఎం నాయకుడు పిట్టల అర్జున్, సీఐటీయూ నాయకులు కొప్పుల శ్రీనివాస్, గొర్రెపాటి బసవయ్య, ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దమ్మపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అమర్లపూడి రాము మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ మండల కార్యదర్శి కురసం ముత్యాలరావు, నాయకులు కేసరి వెంకటేష్, గంగాధర నాగమణి, జుంజునూరి ముక్తేశ్వరి, జుంజునూరి నాగరాజు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి అన్నపురెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అరెస్ట్‌లను ఖండించారు.
రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ నాయకుడు మడకం నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా గ్రామ సమీపంలోని పట్టా భూముల కోసం ఆయన ఆదివాసీలను సమన్వయం చేసుకుని పోరాడుతున్నారు.
గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గద్దల శివకృష్ణతోపాటు సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు భూక్యా నరసింహనాయక్, సోమ్లానాయక్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కొత్తగూడెం పట్టణంలోని విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద నాగకృష్ణ, అభిమన్యు మాట్లాడుతూ ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. అరెస్టులు చేసి ఎస్ఎఫ్ఐ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకుడు భూక్యా రమేష్‌ను ఉదయం 5గంటల సమయంలో అరెస్టు చేసి త్రీ టౌన్‌కు తరలించారు. రమేష్ అరెస్టును సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సీఐటీయూ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు దూలం శ్రీనివాస్, ఒలుగూరి మధు తెలిపారు.