ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 3: ఒక్క ప్రయోగం.. వందసార్లు చేసిన రివిజన్తో సమానం. విద్యార్థులకు పాఠాలను సులభతరం చేసేందుకు సంకల్పించిన విద్యాశాఖ.. ప్రయోగాలను వారి పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చింది. కానీ.. విద్యార్థుల మేధాశక్తిని పెంచేందుకు నిర్వహించాల్సిన రోజువారీ ప్రాక్టికల్స్ కళాశాలల్లో నిర్వహించలేదు. ఇప్పుడు ఆ ప్రభావం పడకుండా విద్యార్థులను తప్పుడు పద్ధతుల్లో ప్రోత్సహిస్తున్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్‌లో ఏ మాత్రమూ నిబంధనలను పాటించలేదు. ‘ఇవి ప్రయోగ పరీక్షలేనా?’ అని సందేహించేలా కొన్ని కళాశాలల్లో నిర్వహణ సాగుతోంది. రోజువారీగా రాసే స్లిప్ టెస్టుల కంటే తీసికట్టుగా విద్యార్థులను గుంపులు గుంపులుగా కూర్చోబెట్టి ప్రాక్టికల్ పరీక్షలు రాయిస్తున్నారు.
ప్రాక్టికల్స్ నిర్వహించే ల్యాబ్‌లో సీసీ కెమెరాలు అమర్చాలని నిబంధనలు చెబుతుంటే.. కొన్ని ప్రైవేట్ కళాశాలలు మాత్రం వాటిని కారిడార్‌లో అమర్చడం గమనార్హం. తొలిసారి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్స్ జరగాల్సి ఉంది. కానీ.. కొన్ని ప్రైవేటు కాలేజీలు మాత్రం ఆ సీసీ కెమెరాలను ప్రయోగశాలల్లో అమర్చలేదు. కేవలం కాలేజీ కారిడార్‌లో అమర్చాయి. దీంతో ప్రాక్టికల్స్ నిర్వహణకు నియమించిన అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.
విద్యార్థులందరూ ఒకే దగ్గర కూర్చొని ప్రయోగ పరీక్షలు రాస్తున్న తీరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, తమ విద్యార్థుల ఫస్టియర్ మార్కుల ఆధారంగా ప్రాక్టికల్స్‌లో మార్కులు కేటాయించాలంటూ ప్రయోగ పరీక్షల అధికారులను ప్రైవేటు కాలేజీలు కోరడం గమనార్హం. ఇదే విషయం గురించి ప్రాక్టికల్స్ విధులు నిర్వహిస్తున్న అధికారులు ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. అయితే, వీరి మర్యాదలకు ఎక్కడా లోటులేకుండా నిర్వాహకులు చూసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక నుంచి జరిగే పరీక్షలకైనా అధికారులు స్పందించి పటిష్ట చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం సెషన్లో జనరల్ 35, ఒకేషనల్ 7 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ జరిగాయి. 3,117 మంది విద్యార్థులకుగాను.. 2,912 మంది హాజరయ్యారు. 205 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో జనరల్ 29, ఒకేషనల్‌లో 7 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ జరిగాయి. 2,674 మంది విద్యార్థులకుగాను.. 2,578 మంది విద్యార్థులు హాజరయ్యారు. 96 మంది గైర్హాజరయ్యారు. రెండు సెషన్లలో కలిపి మొత్తం 301 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో రవిబాబు తెలిపారు. హైపవర్ కమిటీ, డెక్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాల అధికారులు ఉదయం 18 కేంద్రాలను, మధ్యాహ్నం 14 కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఐఈవో వివరించారు.