మామిళ్లగూడెం, మే 14 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తన అధికారాన్ని ప్రజాస్వామిక విలువలను, చట్టాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఖమ్మం మాస్‌లైన్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోక్సో చట్టం ప్రకారం భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాల్సిందేనన్నారు.
ధర్మం, దేశం, గౌరవం, మహిళల రక్షణ అంటూ మాట్లాడే బీజేపీ నాయకులు, మంత్రులు.. తమ కోసం ధర్మాన్ని, చట్టాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ తన కొడుకు అరాచకాలను వెనుకేస్తున్నారని ఆరోపించారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ఒక్కొక్కరి సంగతి చూస్తానని బహిరంగంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఈ పోక్సో కేసును నీరు కార్చేందుకు సీఎం రేవంతరెడ్డి, పోలీసులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి మీద, ఆమె కుటుంబం మీద కేసులు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు.
తన కొడుకుపై పోక్సో కేసు నమోదైనందుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ అతడి మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి సంఘీభావంగా రేపు నిరసన క్యాక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే, రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం వెంటనే పంటల కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, రామయ్య, అశోక్, శిరోమణి, ఝాన్సీ, శోభ పాల్గొన్నారు.