బోనకల్లు, నవంబర్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు హెచ్చరించారు. మోటమర్రి గ్రామంలో శనివారం నిర్వహించిన 9వ సీపీఎం మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను ముగ్గురు మంత్రులున్నా పూర్తి చేయకపోవడం బాధాకరమన్నారు.
రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే సమయంలో రేషన్ కార్డు ఆధారంగా ఇచ్చారా? మాఫీకి, దీనికి లింకు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అనే విషయం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులకు తెలియదా? కౌలు రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? రైతు భరోసా, రైతుబంధుపై ఎన్నిసార్లు మాట తప్పుతారని ఆయన మండిపడ్డారు.
కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేశ్, బొంతు రాంబాబు, చింతలచెరువు కోటేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, దొండపాటి నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ చిట్టిమోదు నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కేతినేని ఇందు, సొసైటీ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.