ఖమ్మం కమాన్‌బజార్, జూన్ 25: రైతులను ఏమి అభివృద్ధి చేశారో, వారి సంక్షేమానికి ఏం పాటుపడ్డారో చెప్పాలని కాంగ్రెస్ పాలకులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు ప్రశ్నించారు. రైతు సంక్షేమ పథకాల్లో ఏ ఒక్క దానినీ సక్రమంగా అమలుచేయకుండా రైతు ఆశీర్వాద సభను ఎలా పెడతారని నిలదీశారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఆ పార్టీ నేతలు నున్నా నాగేశ్వరరావు, వై.విక్రమ్‌లతో కలిసి గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోతినేని మాట్లాడారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులను వరదలా పారించి 2026 పంద్రాగస్టులోగా ఆ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తామని 2024 వైరా సభలో, సీతారామ పంపుహౌస్‌ల ప్రారంభ సభలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆ తరువాత ఆ మాటను మరచిపోయారని విమర్శించారు. ఈ నెల 30న చింతకానిలో నిర్వహించే రైతు, ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సీతారామ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
సీఎం అప్పుడిచ్చిన హామీ ప్రకారం మరో నెలన్నర రోజుల్లో ఈ ప్రాజెక్టును పూర్తిచేయగలరా? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించినా, ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం ప్రభుత్వ నిరాదరణకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాల్సిన ముగ్గురు మంత్రులు తలా ఒక కాల్వ తవ్వుకుంటున్నారని విమర్శించారు. మున్నేరు పాలేరు లింక్ కాల్వను మంత్రి పొంగులేటి, రాజీవ్ కాల్వను మంత్రి తుమ్మల, జవహర్ కాల్వను డిప్యూటీ సీఎం భట్టి తవ్వుకుంటూ నీళ్లను తమ ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలోని ఓ ప్రాజెక్టునూ పూర్తిచేయకుండా, ఓ పరిశ్రమనూ నెలకొల్పకుండా, ఓ యూనివర్సిటీనీ ఏర్పాటుచేయకుండా ఉంటే.. ఇక్కడి ప్రజలు, రైతులు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఆశీర్వదించాలని పోతినేని సుదర్శన్‌రావు ప్రశ్నించారు. 2026 వానకాలం రైతుభరోసా నిధుల విడుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాకు రావడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే.. 2024, 2025 యాసంగి రైతుభరోసా నిధులు ఇప్పుడు జమ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అన్నదాతలు పంటలు వేసుకునేందుకు సకాలంలో ఇవ్వాల్సిన పంటల పెట్టుబడి సాయాన్ని ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే, అటు రాష్ట్రంలోనూ, ఇటు, జిల్లాలోనూ శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు. 8 నెలల క్రితం జరిగిన రైతుసంఘం నేత సామినేని రామారావు హత్య నిందితుల్లో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారని రామారావు భార్య చెబుతున్నా ఎందుకు పట్టించుకోవం లేదని నిలదీశారు. ఆ పార్టీ నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, ఎర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.