ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 15 : విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లాకు డీఎస్సీ-2008 అభ్యర్థుల వివరాలు చేరడంతో నగరంలోని డైట్ కళాశాలలో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అనుమతి తీసుకున్న విద్యాశాఖ అధికారులు శనివారం ఉదయం 7 గంటలకే అభ్యర్థులకు డీఈవో కార్యాలయ సిబ్బంది ఫోన్ చేశారు. కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సమాచారం అందించారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు డైట్ కళాశాలలో కౌన్సిలింగ్ ప్రారంభమైంది. డీఈవో సోమశేఖర శర్మ, డీఎల్పీవో రాంబాబు అబ్జర్వర్‌గా ప్రక్రియను పర్యవేక్షించారు. తొలుత ఏపీవో ఎన్.శ్రీనివాసరావు అభ్యర్థులకు ఆప్షన్ ఫామ్స్, బాండ్ ద్వారా అందజేయాల్సిన అండర్ టేకింగ్‌లో పొందుపర్చాల్సిన అంశాలపై వివరించారు.
డీఎస్సీ-2008లో జిల్లాకు 45 మందిని కేటాయించగా.. వీరిలో ముగ్గురు అభ్యర్థులు ఇటీవల నిర్వహించిన డీఎస్సీ -2024లో ఉద్యోగాలు పొందారు. మిగిలిన 42 మందితో కౌన్సిలింగ్ నిర్వహించగా.. ఏడుగురు గైర్హాజరయ్యారు. 42 మంది అభ్యర్థులకు.. 42 ఖాళీలను ప్రదర్శించగా మెరిట్ ఆధారంగా ఒకరి తర్వాత ఒకరిని పిలిచి ఎంపిక చేసుకున్న పాఠశాలల వివరాలు తీసుకున్నారు. వాటితోపాటు ప్రతీ ఒక్కరి నుంచి మూడు ఫొటోలు తీసుకున్న తర్వాత నియామక పత్రాలు అందజేశారు. సోమవారం పాఠశాలల్లో చేరే సమయంలో రూ.వంద బాండ్ పేపర్‌ను ఎంఈవోకు అందజేయాలని సూచించారు. సాయంత్రం 6 గంటలకు ప్రక్రియ ముగిసింది. నరుకుళ్ల శ్రీనివాస్, వజ్జా కిశోర్, మాలోతు దేవేందర్‌కుమార్, కే శ్రీనివాసరావు, యూసుఫ్ పాషా, వై.శ్రీనివాసరావు, డీఈవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అభ్యర్థుల కోసం అన్ని ఖాళీలను ప్రదర్శించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈవో సోమశేఖర శర్మని డిమాండ్ చేశారు. నగరంలోని 17 శాతం హెచ్ఆర్ఏ వంటి స్థానాలు కూడా ప్రదర్శించాలని విజ్ఞప్తి చేయగా.. ఉపాధ్యాయులు అవసరమైన చోట ఎంఈవోల నుంచి వివరాలు సేకరించి భర్తీ చేస్తున్నామని, ఈ ప్రక్రియకు ఆటంకం కల్పించొద్దని కోరారు. పీఆర్టీయూ, టీపీటీఎఫ్, యూటీఎఫ్, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.