ఇల్లెందు/దమ్మపేట/భద్రాచలం, జనవరి 4 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీసీసీ, సివిల్ సైప్లె హమాలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, దమ్మపేట, భద్రాచలం పట్టణంలో చేపట్టిన సమ్మె శనివారం నాటికి మూడో రోజుకు చేరింది. హమాలీల సమ్మెకు సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, జేఏసీ, సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు.
ఆయా కార్యక్రమాల్లో పలువురు నాయకులు మాట్లాడుతూ 2024 అక్టోబర్ నెలలో జరిగిన జీసీసీ, సివిల్ సైప్లె రేట్ల ఒప్పందాన్ని ప్రభుత్వం జనవరి నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పందం జరిగి మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. దీనిపై జీవో విడుదల చేయకపోవడంతో హమాలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం హమాలీ రేట్ల పెంపు జీవోను విడుదల చేసి, జనవరి నుంచి ఎరియర్స్‌కు బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఆయా కార్యక్రమాల్లో మాస్‌లైన్ నాయకులు రవి, సూర్యనారాయణ, మధు, రాము, హమాలీ మేస్త్రీ బోగి సత్యం, నర్సింహారావు, రొయ్యల ప్రసాద్, జేఏసీ నాయకుడు దేవరకొండ శంకర్, హమాలీ నాయకులు సదానందం, మధు, వీరన్న, రామ్మూర్తి, ప్రముఖ వ్యాపారి పల్లంటి దేశప్ప, సీఐటీయూ నాయకులు బండారు శరత్‌బాబు, గడ్డం స్వామి, నకిరికంటి నాగరాజు, జీసీసీ కార్మికులు ప్రసాద్, శేషు తదితరులు పాల్గొన్నారు.