కారేపల్లి, మే 17 : మతోన్మాద ఉగ్రవాద చర్యలను యావత్ దేశం ఖండించాల్సిందేనని, అయితే యుద్ధంలో అమరులైన సైనికుల మరణాలతో రాజకీయాలు అవసరమా అని సీపీఐ జాతీయ సమితి సభ్యులడు భాగం హేమంత్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ లో కారేపల్లి మండల కౌన్సిల్ సమావేశం పార్టీ సీనియర్ నాయకుడు పాపినేని సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సామ్రాజ్యవాదులు కనుసైగల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందన్నారు. యుద్ధం నేనే ఆపానని ట్రంప్ చెప్పుకోవడం, ఉగ్రవాద చర్యలను మతం పేరుతో రుద్దటం దారుణమైన చర్య అన్నారు. దేశంలో ఉన్న ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారన్నారు. రైతాంగం, కార్మిక వర్గం అనేక ఇబ్బందులకు గురవుతుందన్నారు. దేశంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను హరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టడానికి 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్ మాట్లాడుతూ.. ధరణి లో ఉన్న లోపాలు భూ భారతితో తీర్చవలసిన అవసరం ఉందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నారు. అన్ని గ్రామాల్లో శాఖ మహాసభలు పూర్తి చేసుకుని మండల మహాసభ నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజవర్గ ఇన్చార్జి ఎర్రబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు రావి శివరామకృష్ణ, జిల్లా సమితి సభ్యులు ఉంగరాలు సుధాకర్, చెన్నై శెట్టి భూషయ్య, పుచ్చకాయల శ్రీను, అనంతరామయ్య, వీరూనాయక్, వడ్డే వెంకటయ్య, బట్టు సంగయ్య, భాగం వెంకన్న పాల్గొన్నారు.